పుట:కాశీమజిలీకథలు -01.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదుల కథ

41

రాముడు – మిత్రులారా! మన మనేకవిద్యలం జదివితిమి. ప్రాయమునకు మించిన పాండిత్యము సంపాదించితిమి. దేశాటనంబునంగాని మన విద్యాపాటవంబునకుఁ దేటరాదని నాయభిప్రాయము. అక్కార్యంబున కిదియ సమయము. ఇందులకు మీ రేమందురు?

వసంతుఁడు – నీకు మంచియూహ తోచినది. మన కిప్పుడు వివాహములు చేయవలయునని మన తండ్రులు ప్రయత్నించుచున్నారు. మెడకు లంకెలు దగిలికొనిన తరువాతఁ గదల శక్యమా? దేశము లన్నియుం జూచి రావలయునని నాకు మొదటి నుండియు నుత్సుకమే.

ప్రవరుఁడు - మీ యభిప్రాయములు మేము కాదనువారమా? కూపస్థకూర్మమువలె స్వదేశముననే యెల్లకాలము కాలక్షేపము చేయువారు పండితులైనను మూఢులని నీతిజ్ఞులు చెప్పుదురు. తప్పక యిప్పుడే బయలుదేఱవలసిన సమయము.

సాంబుఁడు - అన్నన్నా! మీ యవ్వనమద మెన్నివికారములఁ బుట్టింపుచున్నది. దేశాటనము మాటలతో నున్నదనుకొంటిరా? వేళకు నాహారము దొరకదు. పండుకొనుటకుఁ దగిన సెజ్జలుండవు. సత్రభోజనము మఠనిద్రయుఁ గావింపవలయును. మిక్కిలి సుకుమారుఁడగు నీరాజనందనుం డాయిడుమలఁ బడయగలడా? పరదేశులం జూచి ప్రజలు కడుఁజుల్కనగా మాటలాడుదురు. నిద్రాహారములు తిన్నగ లేక రోగములు రాకమానవు. ఈవెఱ్ఱియాలోచనలు మాని యింటికడ సుఖముగా నుండనీయుఁడు. యౌవరాజ్యపట్టాభిషిక్తుండై యితండు మహేంద్రవైభవ మనుభవించుచుండ మన మనుచరులమై చూచి యానందింతము. స్వదేశములో స్వగ్రామములో స్వగృహములోఁ బూజ్యత లేని దరిద్రునికిఁ బరదేశ మేగుట గొప్పయని చెప్పఁబడి యున్నది. ప్రాయికముగా విద్వాంసులు దరిద్రులగుట వారికి దేశాటనము కీర్తికరము కావచ్చును. అదియునుంగాక మన తలిదండ్రులు మనల జూడక యొకదినము గడుపనేరరు? అట్టివారు మనపోకకు సమ్మతింతురా, చెప్పకపోతిమేని దుఃఖసముద్రమున మునింగిపోవుదురు. అన్నిగతుల కత్తఱి దేశాటనము సమంజసముగా లేదననాయభిప్రాయము.

దండుఁ – మనసాంబుఁడు కులజమైన పిరికితనము విడువక దేశాటనమునకు జడియుచున్నాఁడు. అతండు నుడివిన కష్టము లన్నియు బరదేశములో ధనహీనులకుఁ గలుగుచుండును. వలసినంత ధనము దీసికొనిపోయిన మనకుఁ బరదేశము స్వదేశము వలెనే యుండును. రాజపుత్రులు యౌవ్వనరాజ్యపట్టభద్రులై దిగ్విజయయాత్ర చేసి వత్తురు. అట్టి యాత్రవలనఁ గొన్ని కొన్ని విశేషములు దెలియఁబడవు; మన మెట్టివారమో తెలియనీక సామాన్యులవలె నరిగినచో నెన్నేని విశేషములు తెలియఁబడక మానవు. ఆహా! భూమండలపటమంతయుఁ నొక్కసారి విమర్శించి చూడుఁడు. ఎన్ని దేశములు, ఎన్ని పట్టణములు, ఎంతలేసి విద్వాంసులు, ఎంతలేసి భాగ్యవంతులు,