పుట:కాశీమజిలీకథలు -01.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వముల నెన్నియేని నాచరించిరి. పిమ్మట నాపుత్రులకు జాతకర్మాదివిధుల యథావిధి నాచరించి రాచపట్టికి వసంతుఁ డనియుఁ మంత్రిసూనునకు రాముఁ డనియు, బ్రాహ్మణపుత్రునకుఁ బ్రవరుఁ డనియు, వైశ్యనందనునికి సాంబుఁ డనియు, కళాదకుమారునికి దండుఁ డనియు, నామాద్యక్షరంబు లేకముగాఁ జదివిచూడ వరప్రసాదులని వచ్చునట్లు పేరులు పెట్టిరి. వరప్రసాదు లేవురు రూపంబునను దేజంబునను గుణంబుల నొక్క పోలిక గలిగి మన్మథునిక దిరస్కరించు చక్కఁదనముతో నభివృద్ధిజెందుచుండఁ దల్లిదండ్రులకు మిగులననురాగ మభివృద్ధి యగుచుండెను.

పిమ్మట నైదేండ్లు వచ్చినతోడనే యబ్బాలుర నొకయుపాధ్యాయునికడఁ జదువవేసిరి. ఆగురువునకు వచ్చిన చదువంతయు వారి కారుమాసములు చదువుటకుఁ జాలినదికాదు. తరువాత నొకసాహిత్యధురీణుని గురువుగా నేర్పరచిరి. అతనికడ వత్సరములో నాటకాలంకారములయం దసమానపాండిత్యముఁ గుదురుచుకొనిరి. పిమ్మట నొకవైయ్యాకరుణుని నాచార్యులగాఁ జేసిన నతనికడ మూడేం డ్లభ్యసించి పిదప నతనికి సైతము తప్పుల దిద్దఁదొడఁగిరి. అట్లు వ్యాకరణపాండిత్యము కుదిరిన తోడనే తార్కికునికడ నొప్పగించిన నారుమాసములకే యతని శిష్యునిగాఁ జేసికొనిరి. పిదప నొకసిద్ధాంతిని మూఁడుమాసములును, వైణికుని రెండుమాసములును, వైద్యుని నాల్గుమాసములును, వేదాంతిని మాసము, వైదికుని వత్సరము, తాంత్రికుని మాసము, మాంత్రికుని మాసము గురువుగ నేర్పరచుకొని యవ్విద్యలన్నియు సాంగముగా గ్రహించిరి. తక్కినవిద్యలన్నియుఁ బుస్తకములే గురువుగా నుండ సంగ్రహించిరి. మఱియు శస్త్రవిద్యయు ధనుర్విద్యయు నశ్వవిద్యయు మొదలగు రాజార్హము లగు విద్యలుగూడ శీఘ్రకాలములోనే సంగ్రహించిరి. ఇట్లు కొలఁదిప్రాయమందే యరువదినాలుగువిద్యలయం దసమానపాండిత్యము గల యవ్వరప్రసాదుల సుగుణములు నిత్యమును బొగడనివారు లేరు. వారి విద్యలు, గుణములు, శీలములు, రూపములు, ప్రజ్ఞలు, తల్లిదండ్రులకేగాక శత్రువులకు సైతము స్తోత్రపాత్రములై యున్నవి. వరప్రసాదులు ఆహారవిహారశయ్యాననరహస్య వ్యాపారముల యందును విడువక యేకప్రాణముగా వర్తింపుచుండిరి. వారియెడ రాజు మొదలగువారికిఁ బుత్రప్రేమ సమానముగానే యున్నయది.

వారు నిత్యము ప్రాతఃకాలమునందును సాయంకాలమునందును మంచిగుఱ్ఱముల నెక్కి పెక్కుదూరము విహరించి వచ్చుచుందురు. అశ్వారోహణమునందు వారికి మిక్కిలి పాటవము గలదని జగత్ప్రసిద్ధమైనది. వారికి బదియారేఁడుల ప్రాయము వచ్చునంత వారికిఁ బెండ్లిండ్లు జేయతలంపు తల్లిదండ్రుల హృదయంబుల నంకురించినది. అక్కుమారు లైదుగురు నొకవసంతకాలమునఁ దురగారూఢులై యుద్యానవనమునకుఁ బోయి యందు విహరించుచున్న నిట్లు సంభాషించుకొనిరి.