పుట:కాశీమజిలీకథలు -01.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదుల కథ

39

ఇట్లుండ నంత నొక్కనాఁడు తనకు సంతానములేదని సంతాపించు భార్య నోదార్చుచు శుద్దమతి యతివా! దీనికై నీవు చింతింపకుము. చక్రవర్తివంటి నందనుం బడయు నుపాయ మే నెఱుంగుదు. శ్రీశైలమునందలి వింతలం దెల్పుగల్ప మొండు నాదండనున్నది. తదుక్తప్రకారము తపం బాచరించి యట్టిపట్టిం గాంచెదనని చెప్పి భార్య యనుమతి వడసి యిల్లు వెడలి క్రమంబున శ్రీశైలంబున కరిగెను.

అందుఁ బాతాళగంగాతీరంబున నరసింహబిలంబున వసించి కందమూలాశనుండై కల్పోక్తప్రకారంబు పాశుపతవ్రత మాచరించుచు నారుమాసములు కాళీధవు నారాధించుటయు నవ్వేల్పు స్వప్నాంతరంబున వానికి బొడసూపిఁ పాఱుఁడా! నీవు సగము భక్తి నన్నారాధించితివి. అయినను గల్పోక్తనియమము జరిపితివి కావున నీ కోరిక తీరుపక తప్పదు. నీవు రేపు స్నానముచేసి వచ్చుచుండ దారిలోఁ జూతఫలం బొండు గాన్పించెడిది. దానిం గైకొని నియమముగా నెందును నేలం బెట్టకుండ నింటికిం దీసికొనిపోయి నీ భార్యకిమ్ము. ఉత్తమసంతానము గలుగఁగలదు. అంతరంబున నేయంతరాయము గలిగినను నాఫలము నీకు దక్కదు సుమీ. అని చెప్పి యాదేవత యంతర్ధానము నొందెను.

పిమ్మట శుద్ధమతి తద్దయుఁజెలఁగి పరిశుద్ధచిత్తముతో నాఫలంబు గైకొని క్రిందవిడకుండ నియమముగా నింటికి వచ్చుచుండ నొకనాఁడు జాముప్రొద్దువేళ తెలగరాయని చెఱువులో నడుచుచు ఫల మొకచెట్టుకొమ్మలసందున నిరికించి ప్రాంతమందలి బావిలో స్నానము చేయుచుండెను. ఇంతలో నావృక్షముమీదనున్న గరుడపక్షి, యాఫల మీక్షించి తక్షణంబ ముక్కుతోను గాళ్ళగోళ్ళతోను జిక్కంబట్టి యట్టె యెగిరిపోయినది. ఆబ్రాహ్మణుఁ డది చూచి మిగుల వగవుతో నతిజవంబునఁ బరుగిడి వచ్చెను గాని యది దూరముగా నెగిరిపోవుటచేత నేమియుం బ్రయోజనము లేకపోయినది. దాన నత్యంతచింతాకులస్వాంతుడై యతండు నిశాంతముజేరి తన పాట్లన్నియు నాప్తులతోఁ జెప్పుకొని తన దురదృష్టమును గురించి జీవితాంతము వరకు చింతింపు చుండెను. భవితవ్య మట్లుండ వాని కాఫల మెట్లు దక్కును?

ఆ పక్షి యట్లు గైకొని యెగిరిపోవుచుండ దైవయోగమున ముక్కు జారి కాశ్మీరదేశపురాజు గూర్చునియున్న బల్లమీఁదఁ బడినది. ఆ ఫలమహాత్మ్యముననే కదా యా యేవురకుఁ బుత్రులు జనించిరి. తర్వాతి వృత్తాంతము వినుము. ఇందాక నిలిపిన కథావృత్తాంతము జ్ఞాపకమున్నదియా. రాజుగారికిని మంత్రికిని పురోహితునికిని కోమటికిని కలాదునకును బుత్రులు గలిగినప్పటి యానంద మెప్పుడును గలిగినది కాదు.

వరప్రసాదులకథ

అట్టి సంతోషముతో వారు పుత్రోత్సవము పంచిపెట్టియుఁ బేదలకుఁ బెక్కు దానములు సేసియు మిత్రులకు బంధువులకు మెండువిందులు గావించియు మహోత్స