పుట:కాశీమజిలీకథలు -01.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దకములకు చెల్లును. బాటసారులనఁగా సంతతము నడచువారు సూర్యచంద్రులకుఁ జెల్లును. ఇంక వెఱ్ఱిమూఢులను పదములు చదువుకొని పెద్దవిద్వాంసులను బిరుదులు బూనినవారికిఁ జెల్లవుగాని యని సగముచెప్పి యూరకున్న యన్నాతితో రాజు భయపడకుము. వారెవ్వరో యెఱిగింపుమని పలికిన నక్కలికి యిట్లనియె.

అయ్యా! వెరపేల వినుఁడు. అందు మొదటివాఁడు నాపెనిమిటియు, రెండవవారు మీరునుఁ గావచ్చును. మధ్యాహ్నకాలమం దైదుగురువిటులతోఁ గ్రీడించుచున్నదని వివేకములేక చెప్పిన నాపెనిమిటియు, నాయన చెప్పినతోడనే జారత్వమున కైదుగు రేల వత్తురను సందియములేక నిజమని నమ్మి పదుగురు పెద్దమనుష్యుల వెంటబెట్టుకొని వచ్చిన మీరును గాక యా బ్రాహ్మణులు గారని నిర్భయముగఁ బలికినది. అన్నాతి నీతివాక్యంబుల కెంతయు సంతసించి యా భూకాంతుండు తన పురోహితుని పెద్దమనుష్యుల యెదుట మిగుల నిందించి కటకటా! యింత యుత్తమురాలగు నీభార్యను నిష్కారణముగ బాధించుచున్న నిన్ను దండించినను దోషములేదు. ఆమెం జూచి నిన్ను మన్నించితి నింకొకసారి యిట్టి సంసారద్రోహపుమాట పలికితివేని క్షమింపక తగిన దండన విధింతునని భయంకరముగాఁ బలికిన నతండేమియుం బలుకక యూరకుండె. పిమ్మట నా శుద్ధమతిం జూచి యతని భార్య సుగుణములు తచ్చిష్యులవలన నెఱింగినవాఁడు గావున నిట్లనియె. ఓహో! యెంత యోగ్యుడవు! త్రిలోకపూజ్యరాలగు భార్యను విడిచి వెఱ్ఱియనుమానముఁ బూని పరదేశ మరుగు చుంటివి. నీవంటి నిర్భాగ్యుం డుండునే? నీ చదువేల? ఇందులకే గదా వృద్దులకు గన్య నియ్యఁగూడదని చెప్పుదురు. వెఱ్ఱిఛాందసుడా ? యిప్పటికైన బుద్ధిలేదా? చెప్పుము, లేకున్న నిన్నును దండింతునని పలికిన నతని కా విషయము చూచినది మొదలు తన భార్యవిషయమై తనకుఁ గలిగిన యనుమానమును కూడ నిట్టిదేయనియు నామె నిర్దోషురాలే యనియు విశ్చయించియున్న కతంబునఁ బశ్చాత్తాపముఁ జెందుచు నృపతి కిట్లనియె.

దేవా! నాకు బుద్ధివచ్చినది. నే నిదివరకు పడిన యనుమాన మంతయుఁ గల్ల యని యిచ్చట జరిగిన ముచ్చటల వలన దెలియవచ్చినది. నేను భార్యతో నిష్టముగాఁ గాపురము సేయుదునని యొడంబడియెను. పదంపడి యప్పుడమియొడయఁడు శుద్ధమతి మిగులఁ బండితుడనియుఁ దన యాస్థానములో నుండఁదగినవాఁ డనియును దలంచి తన యభీష్ట మెఱింగించి యతండు సమ్మతిపడిన మీదట నతనిభార్యను సబహుమానముగా రప్పించి యొకయిల్లు కట్టించియిచ్చి తగినగౌరవముగా వారిం బోషింపుచుండెను. శుద్ధమతియుఁ బురోహితుండును నదిమొదలు తనభార్యలయందు మిగుల ననురాగముగలిగి యేయనుమానములేక వర్తింపుచుండిరి. అయ్యిరువురు ఛాందసులతో నా రాజు వినోదముగా గాలక్షేపముఁ జేయుచుండెను.