పుట:కాశీమజిలీకథలు -01.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

డుదయించును. ఈరహస్యం బెవ్వరికి నెరిగింపరాదు. దీనిం గళత్రముగా నంగీకరించి యంతఃపురంబున నుండ నియమింపుఁ డని మంత్రి యనేకనీతివాక్యంబులు సెప్పి యెట్టకేలకు నాపట్టపురాజు నొడంబరచెను. పిమ్మట నారాజును దానిం భార్యగా గ్రహించి యంతఃపురంబున గోప్యంబుగా నుండ నియమించెను.

మంత్రియు నట్లు ఱేని సమాధానపరచి మఱల నింటికరుగు నప్పటికిఁ దెల్లవారుచుండెను. వీధుల నక్కడక్కడ గుంపులుగా నిలిచి జనులు మంత్రిం జూచి యెద్దియో గుజగుజలాడికొనిరి. మంత్రియు వ్యాకులచిత్తుడై యున్న కతంబునఁ బరిశీలింపకయే యింటి కఱిగెను.

అ ట్లింటి కేగినంత నమ్మంత్రిభార్యయు నెదురువచ్చి ప్రాణేశా! నగరి విశేషము లేమి? ఇంత యర్ధరాత్రంబున రా జేల మీకు వర్తమానము సేసె నెఱింగింపు డనిన నతం డది యొకరాజకార్యపు తొందరయని మరపించి చెప్పుటయు దాని నామె నవ్వి నాథా! మీరు నాకుఁ జెప్పక దాచినను గొంచెము దెలిసినది లెండి యని పరిహాస మాడుటయు నతండు తొందరపడి నీవు విన్న విషయ మెయ్యది వివరింపు మనుటయు నాకాంత నిట్లనియె.

మహారాజుగారు నక్షత్రయుక్తమగు కలశోదకంబు గ్రోలి మదోన్మత్తులై యున్నకతంబున పడకకు నియమింపబడిన రెండవభార్య ప్రసూతివలన యౌవనమునకు భంగము కలుగునని తనదాది నలంకరించి పంపెననియు నతం డెఱుంగక రమించినపిమ్మట నిజంబు దెలిసి దానిఁ జంపబోయి యంతలో మీయనుమతి బడసి చేయుటకు మీకు వర్తమానము పంపెననియు మీరు దానిం జంపవలదు దానికి జనించిన పుత్రుఁడే రాజ్యంబున కర్హు డగునని రాజును సమాధానపరచి దాని నంతఃపురంబున కనిపిరనియు వీధుల జను లనుకొనగా విని వచ్చి మనదాది నాకు చెప్పినది. ఇదియే నేను వినినవార్త నిజమో యసత్యయో మీమనంబునకే తెలియగలదు. అనుటయు నాప్రగ్గడ తెల్లబోయి యౌరా? లోకం బీపాటిది గాఁబోలు. నాకన్న ముందరనే యీవార్త యూరం బడినది. ఇంకేటి రహస్యంబు. చాలుచాలునని పశ్చాత్తాప చిత్తుండయ్యు నారహస్యము రాజున కెఱింగింపఁడయ్యెను. ఇట్లుండునంత నన్నెలంతయు నంతర్వతియై పదియవమాసంబున మన్మథునిం బోలు చక్కనిముద్దులబాలుం గనినది. గోపా! యతండే యష్టదిగ్గజములను బిరుదులు వడసిన మహాకవులచే ననేకకృతు లందిన కృష్ణదేవరాయభూపాలుండు, అని యెఱింగించిన సంతసించు నాఱేనితో మఱియు నా బ్రాహ్మణుండును దేవా! తమకు నట్లే బ్రాహ్మణప్రసాదంబునఁ బుత్రుం డుదయించునని చెప్పెను.

పిమ్మట నర్యవర్యుండును (షరాబు) బ్రాహ్మణుఁడు చెప్పిన చొప్పున పుత్రో