324
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
శ్లో. స్నాతా తిష్ఠతి కుంతలేశ్వరసుతా వారాంగరాజస్వసుః
ద్యూతే రాత్రి రియం జితా కమలయా దేవీప్రసా ద్యాధునా
ఇత్యంతఃపురసుందరీ జనగుణే మ్యానాధికం ద్యాయతా
దేవేనాప్రతిపత్తిమూఢ మనసా ద్విత్రాస్థ్సితా నాడికాః.
కుంతలేశ్వరుని కూఁతురు పద్మావతి మూఁడవ భార్య ఋతుస్నాతయై యున్నది. అంగరాజ పుత్రిక చంద్రముఖి రెండవభార్య యింటికి వెళ్ళ వలసిన వంతు దినము. భోజుండు కమలతో జూదమాడి నాటి రాత్రియే ఫణముగాఁ జేసి యోడి పోయెను. కావునఁ గమలయింటికిని బోవలసియున్నది. పెద్ద భార్య లీలావతి దైవజ్ఞులచే సుముహూర్త ముంచుకొని నాఁడురమ్మని చేటిని పంపినది. ఇట్లు నలువురు భార్యలకడకు నాడు పోవలసిన యగత్యము వచ్చినంత భోజుండు రెండుగడియ లేమియుం దోచక నాలోచించి యెక్కడకుం పోక యింటిలోఁ బండుకొని నిద్రవోయెను.
అయ్యర్థమే సభలో సమస్యగానిచ్చి నంత నితరు లేమియు దెలిసికొన జాలలై రి. కాళిదాసు నిశ్శంకముగా నా కథ పూర్తిఁజేసెను. ఆ శ్లోకమువిని బోజ భూపాలుం డాశ్చర్య సంతోషములతో నతనిం గౌగలించుకొని నా రాజ్య మంతయు నిచ్చినను నీ శ్లోకమునకు సరిపడదు. ఏమియు నీయఁ జాలక నాలింగనముఁ జేయుచున్నాను. ఇది మొదలు నీవు నాకు సఖుండవై గురుండవై మంత్రివై పండితుండవై కవివై మదీయా స్థాన మలంకరించి యుండవలయును. నీకుఁగావలసినంత ధనము నీ యిష్టము వచ్చినప్పుడెల్ల తీసికొని పోవుచుండము. నీవ నేను నారాజ్యమునీది. నిన్నుఁ బోలిన పండితుఁ డీపుడమిలో లేడు. దండి భవభూతి శంకరులు నీవు రచించిన శ్లోకములు తామే రచించితిమని బొంకిరి. వారు నీ సామర్థ్య మెరుంగరు, అని యనేక విధంబుల నక్కవిపుంగవుని స్తుతియించెను.
దండి భవభూతి శంకరులు తదీయ కవితాధోరణికి సిగ్గుపడి తలలు వంచుకొని యసూయలతో నిండ్ల కుం బోయిరి. అది మొదలు భోజకాళిదాసు లన్యోన్య స్నేహశబద్దులై యేకదేహ మట్ల మెలంగుచుండిరి. కాళిదాసు భోజసలంకారభూతుండై దండి భవభూతి శంకరులవలెగాక రాజదర్శనముఁ జేయింపుమని తన్నాశ్రయించెడు యాచకుల మహాపండితు లనిచెప్ఫి గొప్పకానుక లిప్పించుచుండును. కాళిదాసు భార్య పుత్రాదులు లేనివాఁడగుట సంతతము విలాసవతియును వేశ్యయింటిలో నుండును.