Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాళిదాసు కథ

323

అట్టి సమయమున దండ భవభూతి శంకరులు భోజునితో మహారాజా ! ఈతం డీశ్లోకములు రచించెనని నమ్మి మీరు మిగుల సంతసించుచుండిరి. మీరునిన్నఁ గొత్తపండితుం దీసుకొనిరండని చెప్పిన కతనంబున వీని కీ శ్లోకములు రచియించియిచ్చి మీవద్దఁ జదువుమని చెప్పితిమి. అతండట్లు చేసెను. వీని కేమియు విద్యరాదు. ఉన్మత్తుఁడు. దేవర పరీక్షింపవచ్చును పరిహాసమునకై వీఁడు గొప్పవాఁడని మీతోఁజెప్పితిమి. ఆ మాటయేనమ్మి యీ శుంఠ నందల మెక్కించుచున్నారని యాసూయగ్రస్త చిత్తులై వచియించిరి. దండి యేకసంతగ్రాహి భవభూతి ద్విసంతగ్రాహి. శంకరుఁడు త్రిసంత గ్రాహియగుట వారాశ్లోకములు పఠించి తామే రచియించితి మని చెప్పిరి.

శంకాకళంకిత స్వాతుండై భోజుం డీ విషయమురేపు విమర్శించెదగాక నిప్పుడు దయచేయుఁడని చెప్పి యంతఃపురమున కరిగెను. దండి భవభూతి శంకరులు కాళిదాసుతోఁగూడ నటఁ గదలి నెలవులకుం బోవుచు నోయీ ! మాతో నొకమాటఁజెప్పి యందు వేరొకరీతి స్తుతిఁ జేసితివేమిటికి? ఈ శ్లోకములు నీ కెవ్వరు రచియించి యిచ్చిరి ? నిజముఁ జెప్పుమని యడిగిన వెర్రివాడుంబోలె నవ్వుచు నేమియు సమాధానముఁ జెప్పఁ డయ్యెను.

సరే. కానిమ్ము. నీవు మేము చెప్పినట్లు నడిచెదవేని నిన్ను వెండియు సభకుఁ దీసికొనిపోయి కానుక లిప్పింతుము. ఈ శ్లోకములు వీరే రచియించి యిచ్చిరని చెప్పవలయును. ఆ రాజు మామాట గై కొనక నొరులకు గుడ్డిగవ్వయిన నీయఁడు సుమీ? నీకుఁ దెలియకున్న నొరుల నడిగి తెలిసికొమ్ము. అట్లుఁ జెప్పెదవా ? యని యడిగిన నతం డంగీకారము సూచించెను. మరనాఁడు ప్రాతఃకాలమున నందరు రాజసభ కరిగిరి. భోజుండును నియమితకాలమునకు వచ్చి సింహాసన మలంకరించెను.

అప్పుడా మువ్వురు పండితులు దేవా నిన్నటి శ్లోకములు మేము రచియించి యిచ్చినవి కావేమో వీనినేయడిగి తెలిసికొనుఁడు. నిజముఁ జెప్పఁగలఁ డని పలికిన నన్న రేంద్రు డావిషయము విమర్శించెదఁగాక నిప్పుడు నేనొకసమస్య నిచ్చెద. మీ ప్రజ్ఞాఁజూతము. పూర్తిఁజేయుఁడని పలికి యీ క్రింది సమస్య నిచ్చెను.

“అప్రతిపత్తిమూఢ మనసాద్విత్రాస్ద్సితా నాడిశాః”

దండి భవభూతిశంకరుల కా శ్లోక మేమియు నర్దమైనది కాదు. మేనం జెమ్మటలుక్రమ్మ నాకశమువంకఁ జూచుచుండిరి. అప్పుడు కాళిదాసు క్రిందిరీతిఁ బూర్తిం జేసెను.