Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని రాజ్యపాలనము కథ

319

బాదలక్షయు యాచకునకుఁ దదర్దము నీయవలయును. అట్లిచ్చుటకు నా శాసన మవసరము లేదు. లుబ్దుఁ డగునుద్యోగి నాసభలో నుండఁదగదు. అని యాజ్ఞాపించెను.

అట్టి ప్రకటన పత్రికల నాలుగు దేశములకుఁ బంపించెను. ఆ వార్తవిని భూమండలమునఁ గలపండితులు తండోపతండములుగావచ్చి భోజునిపయి శ్లోకములు రచించి గజాశ్వాందోళికాది పారితోషికము లందిపోవుచుండిరి. భోజుండు కవిత్వ ప్రియుండనియు దాతయనియు నచిరకాలములో నతనియశము భూలోక మంతయు వ్యాపించినది. నిత్యము వేలకొలది కవీశ్వరులువచ్చి రాజదర్శనముఁ జేయుచుండుటచే భోజునకు రాజ్యాంగ విషయముల విమర్శింప సమయము లేకపోయినది.

అప్పుడు బుద్దిసాగరుం డాలోచించియప్పటి యాస్థాన కవులలోఁ బ్రసిద్దులై యున్న డండి భవభూతి శంకరులను మువ్వుర కవీశ్వరులఁ బరీక్షకులుగా నియమించి వారు సమర్ధులని చెప్పినవారే రాజదర్శనము చేయదగినది. ఇతరులకుఁ దగిన కానుకలు మేమే యిచ్చి యంపుచుందుము. అని నిబంధన మేర్పరచి రాజుగారిచేత నంగీకరింపఁ జేసెను. తరచు బండితు లితరుల గొప్పవారని యొప్పుకొనరు. దండి భవభూతి శంకరు లెట్టివారిని విద్వాంసులని పిలుచుటకే సమ్మతింపరు. అట్టివారు పరీక్షకులైనచో పండితులగతి యేమగునో యూహింపఁదగియున్నది. ఎట్టి పండితులు వచ్చినను రాజదర్శనముఁ గానీయక చిక్కులు పెట్టుచు సామాన్యులని మంత్రులకుఁ జెప్పి తగుమాత్రము కానుక లిప్పించి యంపుచుందురు. దానఁజేసి భోజునొద్దకు వచ్చు పండితుల సందడికొంతఁ దగ్గినది.

ఒకనాఁడు భోజుండు దండి భవభూతి శంకరులం జూచి ఆర్యులారా ! మంచి విద్వాంసుఁ డెవ్వఁడును రాకున్నవాఁడేమి? మన ప్రకటనలు దేశము లన్నియు వ్యాపించినవియా ? పండితులు లేరా? యని యడిగిన వారు దేవా ! దేవరదాన సముద్రములో మునిఁగి యాచకులు బలచఁబడిరి. అని చమత్కరించుచు మమ్ము మించిన బండితుఁ డెవ్వడు పుడమిలేడని గర్వముతోఁ బలికిరి.

ఆ మాటలు విని భోజుండు కానిండు. పుడమియంత గొడ్డువోయినదా ? వెదకి నెవ్వనినై న మంచి విద్వాంసునిఁ దీసికొని రండని యాజ్ఞాపించెను. వారును సమ్మతించి పోయి యట్టివాఁ డెవ్వడని యాలోచించుచుండగా నా మరునాఁడు దైవికముగా వారియొద్ద కొక పురుషుండరుదెంచి రాజ దర్శనముఁ జేయింపుఁడని కోరి కొనియెను.