318
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
తదితరనృపతుల పేరొక్క టియైన నిలిచినదియా ? క్షణభంగురమగు శరీరమును రక్షించిన బ్రయోజనమేమి యున్నది? కీర్తియొక్కటియె రక్షింపఁ దగినది. మృతుండైనను నరుఁడు యశఃకాయంబున జీవించి యుండును.
పండితునందును మూఢునందును దుర్భలునందు బలవంతునందు మహారాజు నందును దరిద్రునందును మృత్యువు సమముగా వర్తించును. మృత్యుదేవతకుఁ బక్షపాతము లేదు. నీ వయసు క్రమంబున నడచుచుండునుగాని నిముష మాత్రమైన నిలిచియుండదు. కావున దేహముల నిత్యములని యెఱింగి కేవలము కీర్తినే యుపార్థింపఁ దగినది జ్ఞాన విక్రమత్యాగభోగహితంబగు జీవనము విఫలమని యెరుంగునది. అని యుపన్యసించెను.
ఆ మాటలు విని భోజుండమృతహ్రదంబున మునింగినట్లుఁ బరబ్రహ్మ యందు లీనమైనట్లు కన్నుల నానంద బాష్పములు విడుచుచు నత్యంత సంతోషముతో నా భూసురుం గౌగిలించుకొని మహాత్మా ! ఇచ్చానుకూలముగాఁ బ్రతిధ్వనులవలెఁ బలికెడువారు పెక్కండ్రు గలరు. అప్రియములును బథ్యములునగు మాటల నుపదేశించు హితులు దొరుకుట దుర్ఘటము. నిర్భయముగా నాకు హితోపదేశముఁ గావించితివి. భవదీయవచనోపన్యాసంబు విని నా చిత్తము కలకఁదీరినది. ఇది మొదలు పండిత గోష్టితోఁ గాలక్షేపముఁ జేసెదను. ఈ మాటలే నిత్యము వచ్చి నాకుపదేశంపు చుండుము. మనసు కడు చంచలమైనది. దుర్వ్యసనలాలసమై యుండును. మీ పేరేమి? కాపుర మెందు? అని పలికిన నప్పండితుండు తన పేరు గోవిందకవి యని వ్రాసి చూపెను. తానా గ్రామ వాసినే యని చెప్పెను.
అప్పుడు భోజుండా కవివరుని వెంటఁబెట్టుకొని యా స్థానమునకువచ్చి మంత్రునెల్ల రప్పించి యిట్లనియె. అమాత్యులారా ! రాజ్యమదము విపరీతమైన మైకమును గలుగఁజేయు ననుమాట సత్యము. పట్టాభిషిక్తుండనై న పిమ్మట నేఁజేసిన సుకృతకార్య మొక్కిటియు లేదు. నా తమ్ముఁడు జయంతుఁడు రాజకీయ వ్యవహారముల జక్క పెట్టుచుండ నేను బండితగోష్టి నుందునని మొదట సంకల్పించుకొని యుంటి. అన్నియుం బోయినవి. దుర్వ్యసనములపాలై తిరుగుచుండ నొక్కరుండును దెలుపరైరి. నేఁడీ బ్రాహ్మణుఁడు నాకు మంచి యుపదేశముఁ గావించెను. ఇది మొదలు విద్వాంసులు గవీంద్రులును మన యాస్థానమునకు వచ్చునట్లు చాటిం బంపుఁడు. మహా కవికి లక్షయు విద్యాంసున కర్దలక్షయు సామాన్య పండితునకుఁ