Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని రాజ్యపాలనము కథ

317

చుంటి వేమిటికి ? ఇది యెక్కడి సాంప్రదాయమో యెరింగింపుమని యడిగిన నతం డందు నిలువంబడి యిట్ల నియె.

దేవా ! నీవు విష్ణుభక్తుండ వగుట బ్రాహ్మణుల కుపద్రవము సేయ నేరవు గదా ? దానంజేసి నీవలన నా కేమియు భయములేదు. మరియు నీవు లోభా విష్టుండవై యెవ్వరి కేమియు నీయకపోవుట నీ యాశ్రమము వలన నాకేమి లాభము వచ్చెడిని? అందువలన నాశీర్వదింపనైతి. ప్రాతఃకాలమున తొలుతనే కృపణుని మొగముఁ జూచెనేని నాఁ డేమియు లాభముగలుగదని లోకోక్తిగలదు. దాని ననుసరించి కన్నులు మూసి కొంటిని. వినుము. ఎవని యనుగ్రహము నిష్ఫలమో యెవనికోపము నిరర్దకమో యట్టిరాజును స్త్రీలు నపుంసకునింబోలె లక్ష్యము సేయరు. లోభివాని ధనము ప్రగల్భములేనివాని విద్యయుఁ బిరికి వానిబలము వ్యర్థములగుచున్నవి. మరియు మా తండ్రి వృద్దుండై కాశీపురంబున కరుగుచుండ నతనికి నమస్కరించి జనకా ! నేనేమి సేయఁదగినది. ఏ వృత్తి నవలంబింపఁ దగినది. మంచిమాట లుపదేశింపుమని ప్రార్థించిన నతం డిట్లనియె. పుత్రా ! నీ కెట్టి యాపదవచ్చినను ఆడువాండ్రను దుర్మంత్రులును విటులును జెప్పు మాటలకుఁ జెవియొగ్గు నృపతి నెన్నడు నాశ్రయింప వద్దుసుమీ ? దాన ముప్పురాక మానదు. దుస్సచివుడగు రాజును అట్టి వాని నాశ్రయించు వాఁడును మహాపాతకుఁ లనఁబడుదురు.

వివేకహీనుండగు రాజు గుణవంతులగు మంత్రులు చెప్పు మాటలు విన నొల్లఁడు. దుర్జన సంఘము బలిసియున్న కడ సజ్జనుల యవసరమేమిటికిఁ గావలయును ? సుగుణములుగల రాజు ధనహీనుడైనను సేవింపఁ దగినది. కాలాంతర మందైన నతనివలన లాభముఁ గలుగక మానదు. దాత గాని వానికి దాక్షిణ్య మేమియు నుండదు. అని చెప్పిన మా తండ్రి వాక్యముల ననుసరించి తిరుగుచుంటి.

అది యట్లుండె. నీవు సకల విద్యా సంపన్నుఁడ వని లోక విఖ్యాతి యున్నది. బాల్యమునాఁటి నీ సుగుణంబుల నక్కజముగాఁ జెప్పికొనుచుందురు. అట్టి నీవు పట్టాభిషిక్తుండవై దానశీలత్వ మించుకయుఁ బ్రకటింప వైతివి. పండితుల నాదరింప వైతివి. స్త్రీలోలుండవై తృతీయ పురుషార్దమును సార్థకము నొందించుచుంటివి. పూర్వము శిబికర్ణదధీచి విక్రమ ప్రభృతులగు నృపతులు పరలోకములలంకరించి పెద్దకాలమైనను నిజదాన సమజ్జంభితంబులగు సుగుణ వితాదంబులు ధరణీ మండలంబునం దిరంబులై యొప్పుచుండుటఁ దెలియదా?