Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

శా. ఆలోలాక్షులఁ గూడి భోజనృపరాధ్యక్షుండు మేల్తూగు టు
    య్యాలల్‌ తీగెలనూగుఁ బుష్పములఁ గోయం బుచ్చు వాపీపయః
    కేళిం దేలు మనోజ్ఞనాదముల సంగీతంబుల బాడగా
    నాలించు న్బహుభంగులం గెరలి క్రీడాయత్త చిత్తంబుతోన్‌.

ఇట్ల త్తరుణీ రత్నములం గూడి వేడుకలతో వనవిహారము సేయుచున్న యన్నరనాథపుంగవు ననంగ రూపుంగాంచి విస్మయాంచిత స్వాంతయై యక్కాంతారత్నంబు తన తెరగంటితనము సార్దకముగాఁగఁ జూచి చూచి తల యూచుచు మెచ్చుకొనుచుఁ బొగడుచు నక్కుమార శేఖరునియందు బద్దదృష్టియై యొండెరుగక వివశ మానసయై యుండెను.

అట్టియెడఁ బ్రజ్ఞావతి పుత్రీ ! కళత్రయుక్తముగా నాధాత్రీపతిం జూచితిమి. ఇఁకఁ బోవుదము రమ్ము. అని పిలుచుటయు నక్కమలేక్షణ యక్షీణ మోహావేశముతోఁ దల్లీ ! సకల బ్రహ్మాండనాయకురాలగు నయ్యిందిరాదేవి గతాగతములఁ దెలియక మనల నిందుఁ బొమ్మని యేల యానతిచ్చెడిని. సురగరుడోరగ విద్యాధరాది ఖేచరులయం డిట్టి సుందరుడు లేడని ప్రతిన పట్టి చెప్పగలను. అమ్మక చెల్లా ! భార్గవి చెప్పిన నేమోయనుకొంటిని. నా మనము వీనియందు లగ్న మైయున్నది. ఇఁట నుండి రాఁ జాలను. నన్ను వీనికే పెండ్లి చేయుము. ఈ క్రీడా విశేష౦బులం జూడ నీతఁడు దక్షిణనాయకుండని తెల్ల మగుచున్నది. పెక్కులేల? ఒక్క నిమిష మా వయసుకానితోఁ గూడి సుఖించిన యువతికి బ్రహ్మాండాధిపత్య మేమిటికి ? అని తన యభిలాష సూచించినది.

అప్పుడు ప్రజ్ఞావతి యుపాయమాలోచించి యా తోటదాపునబాటలోనిలిచి అక్కటా ! తెక్కలికాండ్రు మమ్ము బాధించుచున్నారు. పుణ్యాత్ములారా ! వచ్చి రక్షింపుఁడు రక్షింపుఁడని యఱచినది. ఆ యార్తధ్వని బోజుండు చెవియొగ్గి విని బాటసారులఁ బాటచ్చరులు గాసి పెట్టుచున్న వారు కాబోలు పోయివచ్చెద నిందుండుడని తొందరగాఁ బలుకుచు ఖడ్గపాణియై వెరవకుఁడు. వెరవకుడు. నేనిదే వచ్చుచున్నానని కేకలు వైచుచు నా దెసకుఁ బరుగెత్తి కొని పోయెను.

అతని‌ రాకఁజూచి కమల కేగంటిచూపుల నవ్విపులాధిపతిం జూచుచుండెను. ప్రజ్ఞావతి యెదురువోయి నమస్కరించుచు అయ్యా ! తమ రెవ్వరో పరోపకార పారీణులు. మా యాపద దాటించిరి. మీ రాకజూచి దొంగలు పారిపోయిరి. మీకుఁ