Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(40)

కమల కథ

313

విహరింతు రిదియే వారి వృత్తాంతము. అని చెప్పి మీ రెవ్వరు ? ఎందుబోవుచున్నారని యడిగిరి.

మేము బాటసారులు మని చెప్పి ప్రజ్ఞావతి పుత్రిక మొగముఁ జూచినది. కమల సిగ్గు విడిచి ఇఁక మనమింటికిఁ బోవుదము. లెమ్ము. ఆయనకు మువ్వురు భార్యలుండిరి. ఇఁక నే నేమిటికి? నా కేమియు నిష్టము లేదు. ఇట్లె యుండెద నెవ్వరినిఁ బెండ్లి యాడనని పలికిన విని ప్రజ్ఞావతి యిట్లనియె.

భక్తపరతంత్రురాలగు నిందిరాదేవి స్వయముగా నానతిచ్చిన విషయముల కన్యదాత్వమేల కలిగెడని? ఇంతకుమున్న మువ్వురు భార్యలు కలిగినరాజు నిన్కెక్కుడుగాఁ బ్రేమించునా ? ఈ రెండు విషయములు శంకాస్పదము లగుచున్నవి. అయినను వాని సౌందర్యమెట్లున్నదో చూచి పోవుదముగాక. ఇంతలోఁ దొందరయేమి యని పలికినది. చూడ నక్కరలేదు. చరిత్రయే చెప్పుచున్నది. నేనుఁ బోయెద. నీవు చూచిరమ్మని కమల నొడివిన బ్రజ్ఞావతి నవ్వుచుఁ గమలా ! నీ యిష్టము వచ్చినట్లే చేయుదువుగాక. ఇంతదూరము రానే వచ్చితిమిగదా? వారిని భార్యలను గాంచిపిమ్మటఁ బోవుదము. అని యెట్టకె నొప్పించినది.

ఇరువురు తిరస్కరిణీవిద్యచేఁ దిరోహితులై యా తోటలో విహరించుచుండిరి. అంతట బోజుఁడు తురగారూఢుండై మువ్వురు భార్యఁలు చతురంతయానమున నెక్కి తోడరా నింద్రవైభవముతో విచ్చేసి యందున్న సౌధంబునఁ బ్రవేశించెను.

సాయంకాలమున లీలావతియుఁ జంద్రముఖియుఁ బద్మావతియు సఖులతో నా తోటలో విహరించుచుండిరి. వారి సోయగములు చూచి కమల తల్లితో అమ్మా ! మనుష్యకాంతలును జక్కగనే యుందురు సుమీ ! ఈపూబోణులం జూచితివా ? అయ్యారే లావణ్యము బాపురే తారుణ్యము బళిరా సోయగము? అని కొనియాడుచు వెనువెంటఁ దిరుగుచు అదిగో నా చీర. ఆ నారీమణి కట్టికొన్నది. తల్లీ ! చూచితివా ? ఈరాజకుమారుఁ డక్కడికివచ్చి యెత్తికొని పోయెం గాఁబోలు. తన భార్యకిచ్చె నాహా! లోకప్రవాదము తప్పదు. ఈ పుట్టముకతంబున నీతని భార్య నగుదునాయేమి? బహు భార్యావల్లభు బెండ్లి యాడిన సుఖ ముండనేరదు దైవసంకల్ప మట్లున్నదియా తెలియదని‌ యాలోచించుచున్నది.

అంతలో బోజుండు నూతనాంబోజశరుండువోలె నొప్పుచున్న నప్పుడతు లక్కడ నరుదెంచెను.