310
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
చున్నారు. దాసురాలిపై కృపఁజేసి యందలి నిజం బెరింగింపుము. మరియు దీని నెవ్వనికిఁ బెండ్లి చేయవలయునో నిరూపింపుము. సకలలోక చక్రవర్తినివి నీ వెరుంగనిది లేదని స్తుతిపూర్వకముగాఁ బ్రార్థించిన మందహాసముఁ గావించుచు నిందిర యిట్లనియె.
కమలా! నీకుఁ దగినవరుఁడు గంధర్వులలో లేకపోయె నేమి? మంచిది. నీ నిమిత్తమై బ్రహ్మతోఁ జెప్పి యొక చక్కనివాని సృష్టింపఁ జేసెదనులేయని పరిహాస మాడుచు నొక్కింతద్యానించి మరియు నిట్లనియె.
ప్రజ్ఞావతీ ! నీ కూతునకు మంచిపని జరిగినది. చీర దాచినవాఁడే భర్త యగునను వాడుక సత్యమైనదే. మనుష్యునికిఁ బత్నియగునని పలికిన నులుకుచుఁ బ్రజ్ఞావతి అమ్మా ! నీ భక్తురాలి కీ యాపద దాటింపలేవా ? క్షణయౌవనులైన మనుష్యుల కేమిసుఖము గలదు. రక్షింపుము రక్షింపుమని దైన్యముతోఁ బ్రార్థించినది.
అప్పుడు మహలక్ష్మి చిరునగవుతో నోసీ ! ఇందులకు నీవు చింతింపకుము. నేను జెప్పఁ దలచుకొనిన వానియొద్దనే నీ పుత్రిక చీరయున్నది. అతండు దేవాంశ సంభూతుండు. వినుము. సరస్వతీశాపంబున బృహస్పతి వసుమతిపై జనియించి యున్నవాఁడు. అతడు నిరతిశయవిద్యారూప వైభవములతోఁ బ్రకాశించుచున్నాఁడు. నీ కూతు నాతనికిఁ బెండ్లి చేయుము. చక్కఁదనము వన్నెకెక్కఁగలదు. కోక చేరుటచే మునుపే బహ్మ విధియించినట్లు తోచుచున్నది. పో, పొమ్మని యానతిచ్చిన విని ప్రజ్ఞావతి యిట్లనియె,
దేవీ ! మహానుభావుండైన సురగురుండు శాపపాత్రుం డగుటకుఁ గారణంబేమి? వాగ్దేవికట్టి కోప మేమిటికి వచ్చినది. ఆ కథ యెరింగింపుమని యడిగిన యిందిర యిట్లనియె.
మహేంద్రుఁ డొకనాఁడు బృహస్పతి పురస్పరముగా ముప్పదిమూడు కోటులు వేల్పులు సేవింప దిక్పాలురతో గూడికొని హిరణ్యగర్భునియోలగంబున కరిగెను. వాణిధవుండు వేల్చుల కెల్లఁ బ్రసన్నుండై యాదరించుచు వారినుచితాసనములఁ గూర్చుండ నియమించెను దివస్పతియు బృహస్పతియు బ్రహ్మకు దాపుననున్న పీఠము లలంకరించిరి. లోకేశుండు స్వాగతపూర్వకముగా దేవతల క్షేమ సమాచారముల దెలిసికొనుచుండెను.