Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అంతకుమున్నే బోజునితల్లి సావిత్రి బుద్ధిసాగరునిచేఁ బుట్టినింటి కనుపఁబడి‌ బోజునిరాక కెదురుచూచుచుండెను. బోజుండు నగరికరిగి తొలుతనే తల్లియొద్ద కరిగి నమస్కరించెను. పుత్రుం గౌగలించుకొని కన్నీటిధారచే శిరంబుఁ దడుపుచు వియోగదుఃఖము వెల్లడించెను.

బోజుండు తల్లి నూరడించుచు దాను బయలుదేరినది మొదలు జరిగిన కథ యంతయుఁ జెప్పి లీలావతిం జూపి యిదియే నీ పెద్దకోడలని చెప్పెను. సావిత్రి నమస్కరించుచున్న లీలావతిం దీవించుచుఁ గ్రుచ్చియెత్తి తండ్రీ ! నీ మేనమామకూతురు పద్మావతియు రూపవతియు యౌవనవతియునై యున్నది. మాసోదరుఁడు నీ నిమిత్త మెదురు చూచుచున్నాఁడు. నలుమూలలకు దూతలఁ బంపెను. పద్మావతియు అత్తా! నీ కొడుకెప్పుడిక్కడికి వచ్చును. చెప్పుము చెప్పుమని నిత్యము నన్ను నిర్భంధించుచున్నది. నీ వప్పుడే యిద్దరిం బెండ్లియాడి వచ్చితివి. పద్మావతిని గూడ బెండ్లి యాడక తీరదని చెప్పిన విని తల్లిమాట మన్నించుచు బోజుండు పద్మావతిం గూడ బెండ్లిఁ జేసికొనియెను. అంతలో బుద్ధిసాగరునిచేఁ బంపబడిన ధూతలు కొంద రక్కడికి వచ్చి యేదియో పత్రికయిచ్చిరి.

బోజకుమారా ! నీ పినతండ్రి నీవు వ్రాసిన శ్లోకమును విని పశ్చాత్తాపముఁ జెంది మరణకృతనిశ్చయు డైనంత మే మొక బైరాగినిరప్పించి చచ్చినవానిం బ్రతికించెదనని వానిచేఁ జెప్పిచింతిమి. ముంజుండు నిన్ను బ్రతికింపుమని వాని ప్రార్థించుటయు నతండు హోమములు చేయుచు నారు మాసములలో రప్పింతునని చెప్పె. ఆ యాసతో నతండు మరణోద్యోగము మానుకొనియెను. ఆ మితి కావచ్చినది. కావున స్యందనారూఢుండవై విశ్చేయుమని నా పత్రికలో నున్నది.

బుద్ధిసాగరుని మతి కౌశల్యమునకును స్వామికార్యభక్తికిని మెచ్చుకొనుచు బోజుండుఁ మువ్వురు భార్యలతోఁ దల్లితోఁ జతురంగబలములతో వెండియు ధారానగరమును బ్రవేశించెను.

అని మరియు దక్కథాశేషవిశేషం బాశేముషీవంతుఁ డవ్వలి నివాసదేశంబున నిట్లు చెప్పుచుండెను.