చంద్రముఖి కథ
307
తిరో చింత్యమైయున్నది. దమయంతి దేవతల యనుజ్ఞఁ గైకొని నలుని వరించినట్లు మీ యానతి నే నాయనను వరించెద ననుజ్ఞయిండని కోరుకొనినది.
రాజపుత్రు లెల్లరులేచి యట్లు చేయరాదు. ధర్మవిరుద్ధము ధర్మవిరుద్ధమని యల్లరిఁ జేయదొడంగిరి. భోజుండు వారి సందడి వారించుచు లేచి నిలువంబడి యా రాచపట్టిని దృఢవ్రత యని చెప్పనోపు. సత్యసంపన్నుల వ్రతములు దైవమే కాపాడుచుండును. ఇపుడు ధర్మవిరుద్దమేమియు జరుగలేదు. అది పురుషుఁ డనుకొని భ్రాంతి పడుచున్నది. కళత్రోపార్జితంబైన విత్తంబు ననుభవించుటకు భర్తకధికారము గలదు. కావున నీ చిన్నది యెట్లయినను నాకుఁ గళత్రమైనదని యుక్తి గా నుపన్యసించి రాజపుత్రుల నెల్ల నిరుత్తరులం గావించెను.
ఆ కథ విని చంద్రముఖి పరమసంతోషముతో బోజుని మెడలో దామంబు వైచినది. మంగళగీతములు మ్రోగించిరి. చితాంగదుఁడు ప్రహర్షుజలరాశి మునుఁగుచు వారి నందలముపై నెక్కించి యూరేగించుచుఁ గోటలోనికిఁ దీసికొని పోయెను.
అప్పుడు రాజపుత్రులందరు నేకమై బోజుని పరాక్రమముఁ. దెలియక సేనలం గూర్చుకొని యల్లునితోఁ గూడుకొని సంగరమునకు రమ్మని చిత్రాంగదునకు రాయబారముపంపిరి అప్పుడు చిత్రాంగదుడు బోజుని కెఱింగించి యతని ననుమతిఁ దనదళముల నెల్ల నా యితము సేయించి శత్రువుల నెదుర్కొనియెను. అప్పుడు రెండు సైన్యములకు సంకులయుద్ధము జరిగినది. అంగరాజు బలము లల్పము లగుట రిపుభటతాడనముల కోడి పారఁ దొడంగినవి. అప్పుడుబోజుండు తురగారూఢుండై పెక్కు సాధనంబుల ధరించి యాయోధనగరంబున కేగి విచిత్ర గమన ప్రహారంబుల సంగరపాటవంబు తేటపడ రెండుగడియలలోఁ జతురంగబలములతోఁ గూడ రాజపుత్రుల నెల్లఁ గాందశీకులం గావించెను.
అవక్రవిక్రమంబున ముహూర్తమాత్రములో శత్రువుల నెల్లఁ బారదోలిన యాభూపాలునందనుని గాంచి చిత్రాంగదుండు కౌగలించుకొని తనపూర్వపుణ్యఫలం బపారమైనదని యగ్గించుకొనుచు నప్పుడే వివాహప్రయత్నముఁ గావించెను. బోజుండు శుభముహూర్తమునఁ జంద్రముఖిం పెండ్లి యాడి యిరువురి తరుణులతోఁ గొన్ని దినంబులందువసించి పిమ్మట గదలి లీలావతి వెంటరా నలకాపురంబున కరిగెను.