296
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
యెందున్నవాఁడు? ఇటకుఁ దీసికొని రమ్మని చెప్పెను. రాధిక పోయి ప్రజ్ఞావంతు నచ్చటికిఁ దీసికొని వచ్చెను. ఆ వర్తకుఁడు దంపతుల పీఠములపైఁ గూర్చుండ నియోగించెను. వర్తకుఁడడుగఁ బ్రజ్ఞావంతుండు తన వృత్తాంత మంతయు నెరింగించెను. అప్పుడు వర్తకునిభార్య నగలన్నియుఁ దీసివైచి ప్రజ్ఞావంతు నెదుటకు వచ్చి నమస్కరింపుచు నే నెవ్వతెనో యెరుఁగుదురా? యని యడుగుటయు నా బ్రాహ్మణుఁ డెగదిగాఁజూచి తెల్లతెల్ల పోవుచు నేమియుం బలుకుటకు మాటరాక దిక్కులు చూచు చుండెను.
అప్పుడు వర్తకుఁడు బ్రాహ్మణుఁడా! వెరవకుము. ఎరింగినఁ జెప్పుము తప్పులేదు. అని పలికిన విని ప్రజ్ఞావంతుఁడు ఈమె నా భార్య సులోచనలాగే యున్నదని జడియుచుఁ జెప్పెను. వర్తకుఁడు నవ్వుచు సులోచనయా? సులోచన లాగున్నదియా? చెప్పుమని తర్కించి మరిమరి యడిగిన సులోచనయే యని మెల్లగాఁ జెప్పెను.
సరిసరి. మంచివాడవే. మాటవరసకుఁ జూడుమనిన నీ భార్యయేయని చెప్పుచున్నావే. నీ భార్య పిశాచమైనదికాదా? ఇక్కడికెట్లు వచ్చినదని యడిగినఁ బ్రజ్ఞావంతుఁ డేమియు మాటాడ నేరక భ్రాంతుండై చూచుచుండెను. అప్పుడామె బ్రాహ్మణుఁడా? నేను నీ భార్య సులోచననే. లలాటలిఖిత దోషంబున నా వర్తకుఁడు దారిం బోవుచు రేవులోఁ దారసిల్లుటయు వెంటంబడి వచ్చితిని. నే నిట్టియైశ్వర్య మనుభవించు చున్నను మనసున నాకళంకము భాధించుచునే యున్నది. ప్రారబ్ధమెంత వారి కిని ననుభవింపక తీరదు మీరు కనంబడిరి చాలా సంతోష మైనది. నన్ను నరకమునకుఁ బోవకుండ దీవింపుఁడు. మీకుఁ గావలసినంత ద్రవ్య మిప్పించెదసు. ఈమెకు శరీరమున బుట్టనరోగమును బిశాచమనియుఁ బ్రయోగమనియు భ్రాంతిపడి వెర్రిచికిత్సలం జేయచున్నావు. సోదెకత్తెయలు వచ్చిన వారి యభిప్రాయముల ననుసరించి చెప్పుచుందురు. నేనును బ్రతికి యుంటిగదా యీమె నెట్లు పట్టుకొంటివి? ఇప్పటికైన నీ భ్రాంతి వదిలినదియా? పుడమి నాడు వాండ్ర కందరికి నీ వెర్రియున్నది. నిజానిజంబులు విమర్శింపక వీరు ప్రయోగము సేసిరనియు వాండ్రు దయ్యములై బాధించుచుండిరనియు నిందించుచు నూరక వాచాదోషముల పాలగుచుందురు. ఇఁక మీ రెక్కడికిని బోవలదు. ఇక్కడనే యుండుఁడు. మీ భార్యకు మందు లిప్పించి రోగము మానిపింపఁ జేసెదనని తన వృత్తాంత మంతయుంజెప్పినది. ప్రజ్ఞావంతుఁడు విభ్రాంతుఁడై చూచుచుండెను. రాధికయు విస్మయముఁ జెందుచు అక్కా! నిన్ను నిందించినందులకు నాతప్పు మన్నింపుము. ఎక్కడికిఁ బోయినను నీ సవతి బాధించుచున్నదనియే చెప్పు చుండువారు. ఇసిరో పిశాచ మనునదిలేదు కాబోలు? భ్రాంతియే యట్లు బాధించుచున్నదియా యని పలికినది.