Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నా భారమించుకయు లెక్క సేయం తమ్ముడా ! ఎట్లున్నది ఎట్లున్నది. వెరువకుము. నీ వ్రణము మానిపించెదని పలుకుచు నెన్నియా యుపచారములుచేసి పసరు పిండి కట్టులుకట్టి యయ్యాత నతన్నుఁ జెందినట్లు బాధపడియె. నిదిగో వ్రణ చిహ్నము చూడుము. దీనిఁ జూచిన వాని యుపచారము లన్నియు జ్ఞాపకము వచ్చు చున్నవి.

శోభావతి - అయ్యో తండ్రీ ! నీ మాటలు జెప్పుచుండ నాకునుం గన్నీరు వచ్చుచున్నదిగదా? గతమునకు నిప్పుడేమి చేయఁగలము. బోజుఁడు మిగుల గుణవంతుడనియే నేనును వినుచుంటిని.

జయంతు - తల్లీ! వానికి నా యందుగల యక్కటిక మే మని వక్కాణింతును. ఒకప్పుడు అన్నా ! నీవు రాజైన వెనుక నాయందీ యనురాగముఁ జూపుదువా ? అని యడిగితి నతండు నవ్వుచుఁ దమ్ముఁడా? ఈ రాజ్యము నీవే పాలించుచుండుము. నేను సంతతమా విద్వాంసుల గోష్టిచేఁ గాలక్షేపము చేయుదు నని కృపారసపూరితులగు చూపులు నాఫై వ్యాపింపఁ జేయుచు నానతిచ్చె. ఆ మాటలు తలంచుగొన గుండెలు భిన్నము లగుచున్నవికదా ?

శోభావతి - పుత్రా ! మీ తండ్రి తెలియక దుష్కార్యముఁ జేసిరి. నీవే యట్లు రట్టుఁబెట్టిన బ్రజ లెంత నిందింతురు. కాలగతి యని తలంచి చిత్తము మరలించుకొనుము.

ముంజుఁడు - ప్రేయసీ ! వాని మాటలు నమ్మి నీవును వేరొకరీతి బలకెద వేమిటికి ? ఎట్టివానికిని రాజ్యము వచ్చిన తరువాత వెనుకటి మాటలు నిలుచునా? వాఁ డట్టి వాత్సల్య మేమిటికిఁ జూపెనో వీఁ డెరుంగునా? జాలిగుండెవాఁ డగుట నిట్లుఁ గుందుచున్నవాఁడు. పోనిమ్ము.

జయంతుఁడు - హా ! త్రిలోకైకసుందరరూప ! హా ! మృదుమధుర గంభీరాలాప ? హా ? సుగుణ జలనిధీ ! హా !; దయానిధీ ! హా ! సుకమారా ! భోజకుమారా ! అన్నా ! నిన్నుంజూచి యెంతో కాలమైనట్లున్నదిగదా ? నన్ను విడిచి గడియ మసలువాఁడవుకావు. ఇప్పుడెట్లు పోయితివి ? నేను గృతఘ్నుఁడగదా ? నీ వెంట రాలేకపోయితినని యనేకప్రకారముల విలపించుచు మూర్చాలస వివశహృదయుండై పండుకొనియెను. తల్లి సేదదీర్చుచు దాపున నిలువంబడినది.

అట్టి సమయమున నాంతరంగిక పరిజను డొకఁడు వచ్చి నమష్కరింపుచు దేవా ! బాహ్లీకునొద్దనుండి నలువురు బ్రాహ్మణులువచ్చి దేవరదర్శన మరయుచున్నారు. మీతో మాట్లాడుటకు సుముహూర్తము మిగిలిపోవుచున్నదఁట. సభకు విచ్చేయుదురేయని చెప్పిన‌ నతండేమియుం దోచక యోలగంబున కరిగె

అప్పుడాబాడబులు స్వస్తివాచక పూర్వకముగా నాశీర్వదింపుచుదాము తెచ్చిన శుభలేఖ లానృపతి కందిచ్చిరి అమాత్యుఁడు గైగొని యిట్లు చదువుచున్నాడు.