Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వార్త విని యంతఃపుర పరిచారికనెల్ల రప్పించి తర్జించి యీ పత్రిక వ్రాసి రాజుగారి శయ్యపై నిడినవా రెవ్వరో చెప్పుడని యడిగిన వారందరు గుమిఁగూడి దేవీ ? మాకీ తెరంగేమియు దెలియదు. పాటలిక కూతురు మాధవిక కంతయుం దెలియునని యేకవాక్యముగాఁ జెప్పిరి. అప్పుడు మాధవికను జేయవలసినంత తర్జనముఁ జేసి యడుగుటయు నది వెరచుచు మంజరికయు దన తల్లి యు దొరికిన కానుకలు సమముగా బంచికొను తలంపుతో నిరువురకుఁ బుట్టిన బిడ్డల దీసికొని పోయిరనియ ఘటదత్తుఁడు కళావతి కుమారుఁ డనియు గళా లయ యంతఃపురంబున మంజరిక యట్టిచీటిని వ్రాసి పఱపుక్రింద నిడినదనియు జరిగినకథ యంతయుఁ బూసఁ గ్రుచ్చినట్లు వక్కాణించినది.

ఆ కథ విని వసుంధరుఁడు సంతోషశోక సంభ్రమములతో నప్పటి వారిం బిలిపించి యా బాలిక వృత్తాంతమును గురించి యడుగుటయు నొక కుమ్మరిది వీధిలో నా పిల్ల నాకుఁ దొరికినది నేను నెలదినములు పెంచి సంతతి శూన్యురాలగు నా మేనత్త కూతునకిచ్చితిని. దాని కాపుర ముజ్జయినీపురము. అదియు మూఁడేండ్లు గారాబముగఁ బెంచి స్వర్గస్తురాలై నదట. తరువాత దాని బంధుపు లెవ్వరో తీసికోని పోయిరని చెప్పినది.

అప్పుడతం డా యుజ్జయనీపురమున కరిగి యా కులాల కులస్థులనెల్ల రప్పించి యా చిన్న దానివార్త నడిగినఁ బెంపుడుతల్లి చచ్చిన వెనుక నా పిల్లను తంతువాయ కులస్థుల కెవ్వరికో పెంచుకొన నిచ్చినట్లు తెల్ల మైనది.

వారికులశీల నామంబులఁ దెలిసికొని యక్కడికిఁ బోయి యడిగిన జివరకుఁ గాళిందీపురమునఁ జంద్రవతియను వేశ్యతీసికొనిపోయి పెంచుకొన్నదని తెలియవచ్చినది. వసుంధరుఁడు తన యిద్ధరి భార్యలతో నా పురమున కరిగి యా చంద్రవతి యింటికిఁబోయి నీవు పెంచుకొనిన కూఁతురేమైనదని యడిగిన నది గోలుగోలమన యేడ్చుచు ఘటదత్తుఁడను జోరుఁడు నా యింటికి విటవేషముతో వచ్చి నా యిల్లంతయు బంగారముకాజేసి నా కూఁతుం దీసికొనిపోయెనని చెప్పినది.

ఆ మాటవిని యతండు మిక్కి.లి పరితపించుచు నా పురనాధుండు కీర్తి సేనుండు తనకుఁ బంధువుడగుట నతనికోటకుం బోయి విమర్శింప ఘటదత్తుఁ బట్టుకొను తలంపులో నా దేశమునకుఁ బోయెనని జెప్పిరి. ఘటదత్తుండు సరోజిని తన చెల్లెలని యెరుఁగక దానిం దీసికొనిపోయెనని మది విచారించుచు వసుంధరుఁడు వారినిమిత్తమై తిరుగుచుండ విజయదేవ భూపాలునిచేఁ బంపబడిన దూత లతనిని వెదకికొనుచు మార్గమధ్యంబునం గలసికొని యా శుభలేఖల నిచ్చిరి.

ఆ పత్రికలం జదివికొని వసుంధరుఁడు పరమానందభరిత హృదయుండై తన భార్యలకుంజూపుచు వారు పడిన యిడుమలకు వగచుచు వారి సుగుణములకు మెచ్చికొనుచు వారి కౌశల్యమునకు నానందించుచుఁ కతిపయప్రయాణములఁ గమలా