244
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
తెలియదు. రాజపుత్రిక కీమాట తెలిసెనేని నీచులుగాఁ దలంపక మానదు. కావున మన యపయళంబు వెల్లడి కాకమున్న యిన్న గరమునుండి దాటిపోవుటయే కర్జము. ఇందులకు నీ వేమని యెదవని యడిగిన నప్పడఁతి ముక్కు పై వ్రేలిడికొని యౌరా ! ఒట్టు పెట్టినట్టీ రాజకింకరులు మనతోడన వచ్చి శుభకార్యములకు విఘ్నముఁ జేయు చున్నవారు అయ్యో ? పదిదినములు దాటిన నీవు చక్రవర్తి వగుదువు. మనము చెప్పకయే యరిగితిమేని రాజపుత్రిక మిక్కిలి పరితపించగలదు. చెప్పిన సమ్మతింపదు. నిజముఁ చెప్పితిమేని గార్యమున కే హాని రాఁగలదు. ఎట్లయిన నిప్పు డిక్కడనుండి యెక్కడికేనిం బోవుటయే మేలు. రాజభటులకుఁ జిక్కితిమేని జిక్కు రాక మానదని పలికినది అది తెరవని తలంచి యిరువురు నాటి వేకువజామున సుమతితో నైనఁ జెప్పక యప్పురము విడిచి యొక యడివిమార్గంబునంబడి నడచుచుండిరి.
అప్పుడు ఘటదత్తుఁడు సరోజినీ ! మనపురాకృతము కడు విపరీతమైనది సుమీ ? ఇరువురకు సిద్ధమైన వివాహములు చెడిపోయినవి. అహ ? కాలమహిమ. ఎంతకాల మిట్లు పారిపోవుచుందుము. మన విద్యామహిమలకు వినియోగ మేమి ? భూచక్రమంతయు నేలుటకు నీ బుద్దిబల మొక్కటి చాలదా ? ఇట్టి దానవు నాతో నడవుల వెంబడి తిరుగుచు నిడుములం గుడుచుచుంటివి. ఇంతకన్న నద్భుత మేదియైనం గలదా ? మరిఁయు బరదారలఁదల్లులగతి బరద్రవ్యంబుం లోష్టముల చందంబునం జూచు నాకు దొంగయనియు జారుఁడనియు నిందఁ గలుగఁజేసిన భగవంతుని యెత్తికో లేమియో తెలియదు. వేగురు వచ్చిననుగృపాణపాణినై యెదురుకొని పరిభవంపఁగల బలము నాకుఁ గలిగియున్నను బిరికివానివలె వెఱచి పారిపోవుచుంటి. ఇది యేమి కర్మమో తెలియదని విచారించుటయు వారించుచు నమ్మించుబోణి యిట్లనియె.
అన్నా ! నీవు ప్రాజ్ఞుండవయ్యుఁ గడగండ్లఁ జెందియున్న కతంబున వివేకము మరచితివి. మనమనగ నెంతవారము. హరిశ్చద్రాదులు పడిన యిడుము లెవ్వరైనం గుడిచిరా ? కాల మెల్లకాల మొకరీతి నుండదు. మంచిసమయము రాకపోవదు. అని యూరడించినది. ఆ రీతిఁ బోయిపోయి వా రొకనాఁడు మిట్టమధ్యాహ్న మొక వటవృక్షమునీడఁ బండుకొని గమనాయాసము వాయ దమ చరిత్రమే చెప్పుకొనుచుండిరి. అప్పుడా మ్రానికొమ్మలపై దాగియున్న నూర్వురు వీరభటులు వారిమాటలు విని వీఁడే యా గజదొంగ వేశ్యాపుత్రికను వెంటఁ బెట్టుకొని తిరుగుచున్నాడు. పట్టుడు పట్టుడని పలుకుచు నేల కురికి నలుమూలలు నాదరించిరి. అప్పు డతం డదరిపడి లేచి సరోజిని కపాయము రాకుండ నుపాయ మరయుచు నెట్లో యతిలాఘవంబున నయ్యంబుజనేత్ర నవ్వలకు దాటించి మించిన పౌరుషముతో దండజరుచుచు రండు రండు. మీ కందరకుఁ గాలంబు మూడినది.