218
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
నతండు నన్నొకతెప నాభూపతి యంతఃపురమునకుఁ దీసికొనిపోయి తన యిరువురు భార్యలకుం జూపించెను. నాఁడు తప్ప వేరొకప్పుడు నేనక్కడికిఁ బోయి యెరుంగనని చెప్పెను. ఆ మాటవిని యాఁబోటి నవ్వుచుఁ చాలుజాలు నాగమనమే నీకీముప్పుఁ దెచ్చినది. రాజులు దీర్ఘక్రోధులు. వారిని నమ్మి యంతికమున నుండరాదు. మరికొన్ని నాళ్ళరిగినఁగాని యాయలుక యుడుగదు మన మిప్పుడందుఁ బోవుట తగదు. వేరొక దేశమునకుఁ బోవుదమని యుపదేశించినది.
అట్లు వారు సంభాషించుకొనుచు నొకతెరువునంబడి నడచుచుఁ గొన్ని పయనంబులకుఁ శింశుమార నగరంబునకుం బోయిరి. అప్పుఱ భేదనంబు చంద్రకేతుఁ డను రాజు సుమేధుఁడను మంత్రితోఁ గూడికొని పాలించుచుండెను. అమ్మహారాజునకు సుముఖ పద్మనాభ చారుకర్ణ పింగళాక్షులను నలువురు కొమరులు గలరు. వారు విద్యారూప సౌశీల్యాది గుణంబులఁ బేరుపొంది ధనుర్విద్యయం దసమానమైన నై పుణ్యము సంపాదించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులవలె మిక్కిలి ప్రఖ్యాతి వడసిరి. వారు నలువురు నాఁడు తురగారూఢులై విహరింప నరుగుచుఁ బట్టణాభిముఖులై పోవుచున్న సరోజినీ ఘటదత్తులం గాంచిరి.
సుము - తమ్ములారా ! ఈ పోవువారిం జూచితిరా ? వీ రొండొరులేమగుదురో చెప్పుకొనుఁడు.
పద్మ -- భార్యాభర్తలని తలఁచెదను.
చారు --- కారు. ప్రాయము సమముగా నున్నది. వేరొక్కవాని యేదియో యుండును.
పింగ - అన్నా చెల్లెండ్రేమో ?
చారు -- అట్టిభేద మేమియుఁ గనంబడదే.
సుము -- ఏకులము వారని తోచుచున్నది ?
పద్మ -- ధూళిచ్చన్నులై మలినాంబరధారులై యున్నకతంబున నిరూపింప శక్యము గాకున్నారు.
పింగ - బ్రాహ్మణులని నా యభిప్రాయము.
సుము - ఆమాటయే నిక్కువము. ఆకారసాదృశ్యముఁ గలిగి యుండుటంబట్టి యన్నా ! చెల్లెండ్రేయై యుండును. నివురుగప్పిన నిప్పు వలె నట్లున్నదిగాని యా చిన్నది కడుచక్కనిదిసుమీ ? క్షత్రియకన్యకయే యైనచో నేను తప్పకఁ బెండ్లి యాడుదును.
పింగ --- రంభవంటి కన్యలం దెచ్చి చూచిన వంకలు పెట్టితివిగదా ? వీ యిట్టి పేద పైదలియందు వ్యాపించినదేమి? అది యొకటే --------- యేమో ? అట్లు వరించుట తప్పుగాదా?