Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యదలించుచు నత్తలోదరి నొకఁడదిమి పట్టుకొని మొఱపెట్టుచుండ నోరునొక్కి బుజము మీద నెక్కించుకొను సీతను రావణుండువోలె నెత్తికొని యతిజవంబునఁ బారిపోయెను. తక్కిన తస్కరులును ముల్లెల్ల నెత్తిపై నిడికొని ననుసరించి యేగిరి.

ఘటదత్తుండును తనవంతు వచ్చినమూట శిరంబున నిడికొని వారివెంట నఱిగెను. అందరును దెల్ల వారకపూర్వ మా నగర ప్రాంత కాంతారములోఁ గలిసికొనిరి. అంతలోఁ దెల్లవారినది. తస్కరులా చక్కెర బొమ్మఁ చక్కదనమునకు మిక్కిలి‌ యక్కజ మందుచు మదన శరవశంవద హృదయులై తమ్ముఁ బెండ్లి యాడుమని కేలువట్టి తిరుగుచుండ నయ్యువతీ రత్నము గుండె పగుల నేడ్చుచు ఘటదత్తుని రాకఁజూచి అన్నా! వీండ్రు నన్నుఁ బీడించుచున్నారు. రక్షింపుము రక్షింపుము. అని మొర వెట్టినది.

అప్పుడు ఘటదత్తుఁ డడ్డమువోయి నా మిత్రులారా ? ఈ చిన్నది కడు నుత్తమురాలు. దీని జోలికిఁ బోవలదు. మనకుఁ దోఁబుట్టువగునని పలికిన వెక్కిరించుచు వాండ్రు బాపురే ? నీవావులు వింతగా నున్నవి. నిన్న రాత్రియెల్ల‌ దీనిం గూడితివి. నీ వంతు తీరినది. మాకు వంతువచ్చినఁ దోఁబుట్టువైనదా ? ఇది నీకుఁ జెల్లెలైనచో నీవు మాకు బావ వగుదువు. నీ చెల్లెలిని మా‌ కర్పింపుము. మేము నీ మాత్రముఁ దెలియని వారముకాము. బోగమువాండ్రకు వావులు కల్పించు చుంటివా ? చాలుఁజాలు. అడ్డము లెమ్ము మాకతంబున నిన్న రాత్రియెల్ల దీని ననుభవించితివి. అప్పుడే నీ సొమ్మయినట్లే యడ్డు పెట్టుచుంటివి. ఇట్లయిన మా జట్టులోనుండి నిన్నుఁ దొలగింతుము సుమీ? యని బెదరించిన నవ్వుచు నతండిట్ల నియె.

ఇత్త లోదరిని నేను సోదరిగాఁ జూచితిని. నమ్మకున్న నే నేమి సేయువాఁడ నది యుంగాక నిది నన్ను శరణు జొచ్చినది. నాకు రక్షింపక తీరదు. నన్ను మన్నించి యిమ్మించుబోణిం గాపాడుడని వేడికొనుటయు నాముచ్చు లిట్లనిరి.

అమ్మక చెల్లా ! ఎంతవాడవైతివి. మా దయవలనం బ్రతుకుచు నిప్పుడెదురాడుచుంటివా ? పొమ్ము. ఇక నీ‌ మాట బాటించువారము కాము. మాకు గోపము వచ్చుచున్నది. కాచికొమ్మని యదలించిన గదలక నితం డిట్ల నియె.

నాకు మీయెడంగల విశ్వాసమునంజేసి యింత జెప్పవలసివచ్చినది. మీకు గోపము వచ్చినందులకు వెఱసువాడను కాను. నామేన ప్రాణము లున్నంతసేపు‌ మీరీ పొలతిని ముట్టలేరు. ఊరక మన నేస్తమేల విథ్వస్తము సేసెదరు. దూరము తొలగుడని యోహటించెను.

అట్ల తండు వాండ్రతో బెద్దగా దగవులాడెను. వాండ్రకు కోపమెక్కి యతనిపై గలియబడిరి. అప్పుడతండు లేడివలె నతిలాఘవంబున నెగిరి యొకని చేతనున్న చంద్రహాసంబు లాగికొని శిరఃకరచరణోదరకక్ష రక్షకముగా ద్రిప్పు