Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నపాదుని కథ

195

అప్పుడు కేసరిణివోయి మా రాజపుత్రికను బెండ్లి యాడుదు కాని రమ్మని కోరిననామె వారివలన సంగ్రహించిన విద్యలన్నియు నా కిచ్చె నేని నేను బెండ్లి యాడెదను. లేకున్న నాకవసరములేదని యుత్తరముఁ జెప్పెను.

ఆ మాటఁ గాంతిసేన నభిముఖముగా విని యతం డనన్య సామాన్యుఁడని నిశ్చయించి సఖీపరివృతయై యక్కోవెల కరిగి యతని పాదములకు నమస్కరింపుచు నిట్లనియెను.

ఆర్యా! మీరు సర్వజనపూజ్యమైన బ్రాహ్మణవంశంబున జనియించితిరి. మీరెరుఁగని ధర్మంబులుండవు. కరభ శరభులు బ్రాహ్మణవంశజులయ్యుఁ జెడుగులగుట నా విద్యల కర్హులుకారు. టక్కరిటమారీలుకడ నట్టిమాయ లుండినచో లోకములకెట్టి యపకారమో యూహింపుఁడు. వీరసేనుఁడు రాజపుత్రుండైనను పూర్వ పదజ్ఞుండు కామింజేసి యతనికడ నా విద్య యుండతగినది కాదు. మీ‌ గురుపుత్రుని చాపల్యము మీకుఁ దెలియకపోదు. నా కీ మాయవిద్యలతో నొక్క ప్రయోజనము లేకపోయినను దుర్జనులకడ నట్టివిద్య లుండఁగూడదను తలంపుతో వారినెల్ల వంచించి యవి లాగికొంటి. మీ రుత్తములగట నీ విద్యలన్నియు మీ యొద్దనుండవచ్చును. మీ కిప్పుడే ధారవోయుచుంటిని. గైకొనుడు మీ గురుపుత్రుం దీసికోనిపొండు అని యతండు నమ్మునట్లు నుడివినది.

ఆ మాటలు విని యతఁడు మిగులసంతసించుచుఁ తరుణీ నీ యాశయము సకలజనసమ్మతమై యున్నది. ఈ విద్యలన్నియు నీ యొద్దనుండఁదగినవి. మా గురుండు మిగుల తపశ్శాలి. సకలవిద్యా పారంగతుఁడు. ఆయనకు లేక లేక యొక్కరుఁడే కొమరుండుదయించెను. వానిం బట్టికొని నీవు చఱసాలం బెట్టించితివి. వీనికొర కమ్మహానుభావుండు మిక్కిలి పరితపించుచున్నవాఁడు. నాకు సమ్మతముగా నీ వాతనిం బెండ్లియాడుము. ఇదియే నా కోరిక యని పలికిన యిట్లనియె.

సర్వజ్ఞులైన మీ రట్లనుట శోచనీయముగా నున్నది. అధమునకు నాలి నగుటకంటె నుత్తమునియింట దాదిగానుండుట లెస్పయని పెద్దలు చెప్పుదురు. మీ గురుపుత్రుని మతిప్రాగల్బ్యమెట్టిదో ప్రఖ్యాతమేకదా ? అదియునుంగాక నన్నీ విద్యలో నోడించినవానిని బెండ్లియాడెదనని నియమముఁ జేసికొంటి. అన్నిటికంటె వ్రతభంగ మెక్కుడుగదా ? మతిమంతులు మీకుఁ బదివేలు సెప్పనక్కరలేదు. అప్పుఁడురత్నపాదుం డిట్లనియె.

కాంతా ! నీవన్నదంతయు సత్యమే. మద్గురుండు పుత్రుని విజయము కొరకు నాకా మంత్ర ముపదేశించెను. ఇప్పుడు నేను మరియొక తెఱవుఁ దొక్కిన నతండేమనుకొనును. ఇప్పని నాకు సమంజసము కాదు. వేరొక తెరువుఁ జూచుకొనుమని బోధించెను.