Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసేనుని కథ

181

అప్పుడు కేసరిణి యా మాయావతిచే నొకపూదండ నతనిమెడలో వేయించినది. అతండు పరవశుండై యా చంద్రముఖి పాణిగ్రహణముఁ గావించెను. అట్లు కేసరిణి వారికి మాయావివహాహముఁగావించి యిద్దరి నేకశయ్యాగతులం గావించి వాకిట‌ కరిగినది. అప్పుడతండు మోహాతిశయంబున -

సీ. లలితహారముల చిక్కులుదీర్చు నెపమున
            గులుకుగుబ్బలకుఁ జేతులు దగుల్చు
    జిరిచెమ్మటలుఁ దుడిచెడి కైతపంబున
            నిద్దంపు చెక్కులు ముద్దునెట్టు
    నవల రేగినశయ్య సవరించు నెపమున
            గదిసియొయ్యనఁ బ్రీతి గౌఁగఁలించు
    నెరికురు ల్ముడివైచు నెపమున దరిఁజేరి
           గిలిగిలింతలువెట్టి కేరఁజేయు

గీ. తెలువఁ గీలంటి వాతెర తేనెఁగ్రోలు
    నళుకు దీరంగ నఖరచిహ్నములనాటు
    సురటిఁ గైకొనివీఁచు సుందరముఁజూచుఁ
    జేతిబంధంబు సడలించు సిగ్గుతోడ.

అట్లు మోహపరవశుండై యారాజపుత్రుండు రతిక్రీడ కుద్యోగించుటయు నక్కలకంఠికుంఠీభూతాలాభిష యై యతని యుత్కంఠ కంతరాయముఁ గలుగజేయు చుండెను. అది యెరింగి అతఁడు మదవతీ ! కొదువ యేమున్నది. వెనుతీసెద వేమిటికి ? నీ యభిలాషయెద్దియేనిం గలిగిన నుడువు మనుటయు నక్కుటిలాలక యలతినగవు మొుగమున మొలకలెత్త నభినవచిత్తజా ! మా కోరికలం దెలిసి తేలిక పడనేల ? తప్పక తీర్తునంటివేని వక్కాణించెదనని పలికినది.

ఆ మాట విని యతండు స్మారవికారంబున మైకముజెందియున్న కతంబున నొడ లెరుంగక ఆహా ? సుందరీ ? ఇందులకు నీ డెందమున సందియ మేల గలుగవలయును. నా ధనము నీ ధనము కాదా? కోరు మేదియైన నిచ్చెదనని యొత్తిపలికిన నక్కలికి యిట్లనియె.

గీ. ఓమహేంద్ర నందనోపమపరరూప
   యా మహేంద్రజాల మన్మదీయ
   కామితంబుఁ దీరఁ గౌతుకం బేపార
   థార వోయుమయ్య థర్మబుద్ధి.

అని కోరుటయు నతం డొం డెరుఁగ కున్నవాఁడు కావున మరుమాట పలుకక యిదిగో యిచ్చుచున్న వాఁడ. నీరుఁ దెచ్చుకొమ్మని పలికినంత కంతకుమున్ను యాప్రాంతమందు వేచియున్న కాంతిసేన తన శాంబరీపాటవంబున మాయావతిని