Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యొద్ద దాచనేల ? ఆమె జవ్వనము రూపము సాద్గుణ్యము నొందుట మీ రంగీకరించిన నప్పుడుగదా ? అని అత్యంత చాతుర్యముగాఁ బొగడుటయు నతం డుబ్బుచు నిట్లనియె.

కేసరిణీ ! కాంతిసేన యందరివలె నన్ను మోసముఁజేయలేదు గదా ? ఇంతకుముందు పెక్కండ్ర నిట్లే పెండ్లి యాడెదననిచెప్పి బద్దులం గావించినదట. నిజముఁ జెప్పుమనుటయు నది దేవా ! మనోహరాకారముగల దేవరను వరించుటకంటె భాగ్య మేమియున్నది. అది యెవ్వరినో పెండ్లి యాడవలసినదియేకదా ? వంచకుల వంచించినను దోసములేదు. కోరఁదగినరత్నము వడిలోఁ బడుచుండ త్రోసివేయు వెంగలి యెందైనం గలఁదా ? మీ కిట్టి సందియము కలుగరాదని మోహం బొదవించెను.

సరే అట్లయిన మేమంగీకరించితిమి. ఆమె కిష్టమున్నట్లు నీవే చెప్పుచుంటివిగదా ? ఇఁక జాగుసేయ నేమిటికి ? ముహూర్తము నిశ్చయింపుమని చెప్పు చుండఁగఁ గరభ శరభ శంతనులు వచ్చి దేవా! ఇదియేమి పాపము? మా కోరికలు తీర్పకయే పెండ్లి నిశ్చయించుకొనుచున్నా రేల ? మీరును దానిమాయలోఁ బడిపోవుచున్నారు. సుఁడీ‌ యని పలికిన నతఁ డిట్లనియె.

మీ కే కొఱంతయు రానీయను. పెండ్లి యాడిన వెనుక నది మనకు విధేయురాలై యుండక తీరదుగదా ? అప్పుడు దానితోఁ జెప్పి యొప్పించి మీ విద్యలు మీ‌ కిప్పింతు. మీరు చింతింపకుఁ డని యోదార్చెను. అప్పుడు కేసరిణి జనాంతికముగా రాజపుత్రా ! గాంధర్వ వివాహంబునకు విథినియమంబులులేవు. నీవు రేపు ప్రొద్దుట నిక్కడికి దక్షిణముగానున్న పూఁదోటకు రమ్ము. అందు మీ యిరువురు గలసికొని మాట్లాడికొందురుగాక యని జెప్పి యొప్పించి చేతిలోఁ జేయి వైపించుకొని గురుతులు చెప్పి యప్పొలఁతి కాంతిసేనయొద్ద కరిగి జరిగిన కధయుం జెప్పినది.

మరునాఁ డరుణోదయమునఁ గాంతిసేన నిద్రజాలంబున నొక పూఁదోటఁ గల్పించి యం దనల్పశిల్పాకల్పభాసమానంబై జయంతకల్పంబగు సౌధంబువిరాజిల్లం జేసి నిజప్రతిబింబంబోయన నొప్పారు నొప్పులకుప్ప నప్పూఁదోట విహరించునట్టు జాలముపన్నెను. దానిననుసరించి కేసరిణి తిరుగుచుండెను. ఇంతలో రాజకుమారుఁడు దివ్యమణి భూషాంబరంబుల దాల్చి యొయ్యారముగా నా పుష్పవనంబున కరుదెంచెను.

కేసరిణి యెదురువచ్చి యర్ఘ్యపాద్యాదివిధులు నిర్వర్తించి నివాళులిచ్చి యొక గద్దియంగూర్చుండబెట్టెను. ఇంతలో నా మయావతి యరుదెంచినది. అమ్మించుబోణిం జూచి యతండు మోహపరవశుండై యది ------- స్వప్నమో నిజమో ‌తెలిసికొనలేకపోయెను.