Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

పొమ్ము. ఆ విప్రపుత్రిక కడు నుత్తమురాలు. కాలిలో శంఖచక్రము లున్నవి. దానివలన నన్నికోరికలు తీరఁగలవని పలుకుచునే యంతర్దానము నొందెను.

నే నప్పు డేమిచేయటకుం దోచక మీ యగ్రహారము పేరును మీపేరును వర్ణించుకొనుచు నట గదలి తిరిగి తిరిగి నేటికి మీ యూరు చేరితిని. మిమ్ముఁ బొడగంటి నిదియే నా వృత్తాంతమని యా కథయంతయుం జెప్పెను.

అప్పుడు కర్దముఁ డుబ్బుచు భార్యను బిలచి సాధ్వీ! నీ మాటలన్నియు బూటకములని పాటించితినిగాని. సత్యములేయైనవి. అమ్మాయికి సార్వభౌముఁడగు కొడుకు పుట్టునని శంకరులే యానతిచ్చిరఁట వింటివా ? అన్నన్నా! హయగ్రీవ సోమయాజి యింత‌ నిదర్శనముగాఁ జెప్పునని యెన్నఁడు నెరుంగనే. అని మెచ్చుచు భార్య కావృత్తాంతమంతయుఁ జెప్పెను.

ఆ యిల్లాలు తన మనుమఁ డప్పుడే చక్రవర్తి యైనట్లుఁ జెలఁగుచు మీకు నా మాటలన్నియుఁ బూటకములుగనే తోఁచును. ఇప్పుడైన‌ నమ్మితిరా ? అమ్మాయి కాలిలో శంఖచక్రములున్నవి. చూడుఁడని నాఁడు జెప్పినమాట జ్ఞాపకమున్నదియా ? కాళ్లు పగిలి యిట్లున్నవి. బీటలుగాని చిహ్నములుకావని మీ రనలేదా ? నన్నును బిడ్డనుజూచిన మీ కొకప్పు దిష్టమున్నదియ? యని యెత్తి పొడుచుటయు నతండు పోనిమ్ము. నీ మాటలన్నియు నమ్మితిని. ఇఁక ముందరికార్యయు చూడుము. మన పిల్ల నీతని కీయవలసినదేనాయని యడిగిన నామె యిట్లనియె.

దాని యౌన్నత్యము చూడలేక మీ కిష్టముకాకున్న లేకపోవచ్చునుంగాని నాకేల యభిమతము కాకుండెడిది. ఇన్ని దినము లాపినది యిందులకే కాదా ? ఇప్పుడు శీఘ్రముగాఁ బెండ్లి చేయఁదగినదియే యని పలికెను. శంకరుఁడు పంపె ననియుఁ దన పుత్రికకుఁ జక్రవర్తి పుట్టునను సంతోషమేకాని యా వార్త నిజమా ? దబ్బరా యను విషయ మించుకయుఁ దలంచినదికాదు.

ఆ దంపతులు పొందెడు సంతసముఁ జూచి కౌశికుఁడు దాపునకువచ్చి మీతో నొండు చెప్పమరచితిని. నా వివాహమైన తరువాతకాని యీ రహస్య మొరుల కెరింగింపరాదని శంకరులు నుడివి యున్నారు. మీరు తొందరపడి యెవ్వరి వద్దనైన నీ మాట వెల్లడింతురు సుమీ! ప్రమాదము జరుగునట అనుడు నా యిల్లాలిట్లనియె.

అవును. ఆ మాటయు నిజమే! మా యిరుగుపొరుగువారలే మమ్ముఁజూచి యోర్వలేకున్నారు. ఈ మాట తెలిసినఁ గన్నుల నిప్పులు గ్రక్కుకొని కార్యముఁ జెడదీయఁ గలరు. ఈ నడుమ రెండు మూడు సంబంధములు వారి మూలముననే తిరిగిపోయినవి. నెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగా జరిగించుటయే యుచితము. శంకరులు సర్వాంతర్యాములు గనుకనే యిక్కడి యసూయయు