152
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
బ్రాహ్మణి :- నే నుత్తమయిల్లాలును గనుకనే మీతోఁ గాపురముఁ జేయుచుంటిని. మీరు పుట్టెడు రట్టులకు మరియొకతె యైనచో నీపాటి కింటికి జిచ్చు పెట్టి లేచిపోవును.
బ్రాహ్మణుఁడు :- అవును. నీ వరుంధతి యంతదానవని నీ కీర్తి స్వర్గలోకములోఁ జెప్పుకొనుచున్నారు. నేను బెట్టెడు బాధలేవియో చెప్పము.
బ్రాహ్మణి :- చెప్పవలయునా? వినుండు. మీ చేష్టలు రామాయణ మంత గ్రంధమగును. రెండుపూటలయందు వంట జేయుట కష్టము. ఒకతేపయే వండి యన్నము రాత్రికి మూతబెట్టెదనన్న నేమంటిరో జ్ఞాపక మున్నదియా ?
బ్రాహ్మణుఁడు : - ఏమంటినో నీవె చెప్పము.
బ్రాహ్మణి :- నాకు నియమ మున్నది. మధ్యాహ్న పదార్దములు రాత్రి భుజించనని చెప్పలేదా?
బ్రాహ్మణుఁడు : - సరేఁ ఇదియొక నేరమా? మరియొకఁటి చెప్పుము.
బ్రాహ్మణి :- నాఁడు తలకాయ నొవ్వుచుండఁ బాచి చేయలేక వీధితుడిచి యిల్ల లికి నీళ్ళుదెచ్చి వంటచేయమనిన నేమంటిరి ?
బ్రాహ్మణుఁడు :- అదియు నీవే చెప్పుము.
బ్రాహ్మణి :- ఆవల నార్త్విజ్యమునకుఁ బోవలయును. యజ్ఞము జరుగుచున్నది. అని నిలువక పరుగెత్త లేదా ? మీరు మరచిన నేను మరతునా ? ఒక్క నాటికే మీ కింత కష్టముగానుండ నెల్ల కాలము నేనుమాత్రము సేయఁగలనా ?
బ్రాహ్మణుఁడు :- ఇది యొకతప్పా? ఇంకొకటి చెప్పుము?
బ్రాహ్మణి :- వేనవే లున్నవి. చెప్పిన లాభమేమి? మీ ప్రకృతి యెప్పటికిని మారదుగదా ? అల్ల నాడు పొయ్యలక మనినంతనే కదా మూడునాళ్ళు మూతి ముడుచుకొని కూర్చుంటిరి. వాదులు మానిన వాతలు మానునా? నే నింతియే పెట్టిపుట్టితిని. ఆ సోమిదేవి భర్తం జూడుఁడు. దానిం గూర్చుండఁబెట్టి యింటి చాకిరి యంతయు నాతఁడే చేయును. రాత్రులు కాళ్ళు పిసిగి మరియు నిద్రపోవునఁట. దాని యదృష్టమది నా యదృష్టము.
బ్రాహ్మణుఁడు :- ఓహో ? నీ కెంత యూహ యున్నది. నేనుగూడ నట్లు చేయుదునులే. పోనిమ్ము. ఆ గొడవలు పిమ్మట విమర్శింతము. పెద్దన్న కొడుకుమాట యేమి చెప్పెదవు ?
బ్రాహ్మణి :- వాకిటికివచ్చిన యతిధికైన నిత్తునుగాని పెద్దన్న కొడుకున కీయను.
బ్రాహ్మణుఁడు :- పోనిమ్ము. నీ యిష్టము వచ్చినట్లు చేయుము అని మాట్లాడుకొనుచు నంతలో నిద్రవోయిరి.
ఆ సంవాదమంతయుఁ గౌశికుఁడు చెవియొగ్గివిని సంతోషించుచు వేకువ