150
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
దొడంగిరి. రెండు మూడు దివసంబులు నిద్రాహారములు మాని యా గంగ యొడ్డునఁబడి విలపించితిని. అప్పుడు పురరక్షకులు నన్నక్కడినుండి లేవఁగొట్టిరి. మరియొక ఘట్టమునకుం బోయితిని. పన్నూడిన విలపించెడు వెర్రిపారుఁ డితఁడే యని జనులు గుంపులుగా వచ్చి నన్నుఁ జూచుచుండిరి. ఆ విద్యలు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లఁ బెద్ద కంఠముతో నేడ్చుచుందును. జనులు నవ్వుచుందురు.
మరికొన్నిన్నాళ్ళకు నాకునేను యుపశమించుకొని యిట్లుఁదలంచితిని. ఆహా! దీర్ఘతముఁడు తుచ్చభోగములఁ గోరికొంటినని నాఁడే శపించెను. తెలిసికొనలేకపోయితిని. ఇక నే నింటికిఁ బోయి పెండ్లి యాడి సంతతివడసి నా కుమారుని కీ విద్యల నుపదేశించెదగాక. నా తపంబప్పుడు సఫల మయ్యెడిని. అని తలంచి యప్పుడే యప్పురము వదలి పయనము సాగించితిని. అందలి బ్రాహ్మణులకును మనకును నాచారభేదములు చాలఁ గలిగియున్నవిఁ కావున వారి కన్యకల నంగీకరించితిని కాను.
తిరిగి తిరిగి మీ యగ్రహారముఁ జేరితిని. మీ కూఁతుం జూచిసది మొదలు పెండ్లి యాడవలయునని యిష్టము పుట్టినది. నే నంత పెద్ద వాఁడను కాను. మంచు దేశములో నుండుట నిట్లు పండిపోయితిని. వేగము సంతతిం బడసి నా విద్యలు రెండును బుత్రుల కుపదేశించెదను. అని యుపన్యసించుచు నేను పెండ్లికొడుకునని చెప్పెను.
భట్టపారుండు పక్కున నవ్వుచు బళిరా! కామగ్రీవా ! నీ కోరిక బాగున్నది. నీ మాటలవలన వెనుకటికథ యొకటి జ్ఞాపకము వచ్చుచున్నది. వినుము.
కౌశికుని కథ
నీవలెనే కౌశికుంకుడ బ్రాహ్మణుఁడు బాల్యంబున మాతా పితృ విహీనుండై రక్షించువారును లేక స్వేచ్ఛగాఁ దిరుగుచుండెను. విద్య యేమియు నంటినవికాదు. విటులలోఁ గలసి జూదరులకు మొనగాడైఁ తస్కరులకు నాయకుఁడై పాలసులకు నొజ్జయై క్రుమ్మరుచుండెను. సత్రభోజనమును మఠనిద్రయుఁ గావించి తిరిగెడి యా చెడుగునకుఁ గన్య నెవ్వరిత్తురు? అట్లుఁ బరువంబున గరువంబున నొడ లెరుంగక తిరుగుచుండ నంతలో వార్దక్యచిహ్నములు పొడసూపినవి.
కృష్ణపక్షంబున భ్రమరవృక్షాంచల నిర్మలమగు నాకసంబునఁ బొలుపొందు తారలవలె నడుమ నడుమ ఫలితకేశము లగుపడుచుండెను. సులోచనములైనను సులోచనాపేక్షఁ బ్రవర్తించినవి. రదనంబులు కదలకున్నను గుదుళ్ళప్రటిమ సడలుటఁ గఠిన భక్ష్య భక్ష్యణాసమర్థములైనవి. నడలు జడితఁ గావించినవి. నిద్రకొఱఁత వడినది.
అప్పు డతండు తనకు వివాహము కాలేదను చింత ప్రబలి యందందుఁ