పుట:కాశీఖండము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 83

మణికర్ణిక ముక్తివధూ
మణికర్ణికఁ దలఁచుఁ దపసి మానసవీథిన్. 150

సీ. కరవల్లిఁ బఠియించుఁ గళము సంశోధించుఁ
బ్రాణోపనిషదభిప్రాయ మరయుఁ
బఱిపాటి ముండకోపనిషత్తుఁ దాపనీ
యోపనిషత్తు నభ్యుపగమించు
నఱియు నధర్వవేదశిరఃప్రపంచంబు
లారణ్యకముత్రోవ లరసి చూచుఁ
బ్రశ్నోపనిషదర్థపరిమళంబు గ్రహించు
శ్రీభగవద్గీతఁ జిత్తగించుఁ
తే. దల వకారంబు శ్వేతాశ్వతరము ననెడు
నునిషత్తులు దలపోయు నొయ్య నొయ్యఁ
గాశికాక్షేత్రవిప్రయోగప్రభూత
హృదయసంతాపశాంతికై యిల్వలారి. 151

వ. అప్పుడు. 152

మ. క్షితిపాలోత్తమవంశభూషణము, లక్ష్మీభారతీపార్వతీ,
ప్రతిబింబంబు సమగ్రకాంతిమతి లోపాముద్ర నీక్షించి య
ద్భుతముం బొందుచు వింధ్యనామకమహాభూమిధరారణ్యదే
వత లందంద నమస్కరింతురు మనోవాత్సల్య మొప్పారఁగన్. 153

మ. నలి వింధ్యాచలకాననాంతరమున న్వారాణసీత్యాగవి
హ్వలభావంబున నిల్చి నిల్చి హర! నీహారాంశుమూర్ధన్య! ని
ర్మల! కాశీశ్వర! నీలకంఠ! యనుచున్ మ్రాన్గన్స్నును వాటిల్లఁ ద
త్కలశీసూనుఁడు మూర్ఛఁ గైకొను సమగ్రంబైన తద్వేదనన్. 154

వ. వెండియుఁ గుంభసంభవుండు. 155