పుట:కాశీఖండము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 77

స్థితుం డగుపవనుండు యావత్కాలంబు నిడయందు సంక్రమించు నంతకాలం బుత్తరాయణం బీప్రకారంబున దక్షిణాయనంబు నెఱుంగునది. 129

చ. సమగతి నేకకాలమున సంగతి యాషవతీకళత్రుఁడున్
గమలహితుండు ప్రాణమనుగాడ్పులు దారటుకూడి పింగళా
ధమనిని డాసి తీవ్రగతిఁ దార్కొని క్రుంకుదు రస్తమింతు రే
సమయమునందుఁ దాల్చునది చంద్రనిభాస్య! యమాభిధానమున్. 130

తే. పాము కుండలి చంద్రుండు ప్రాణపవన
మాసిరావల్లి యెప్పు డయ్యనిలుఁ గ్రోలు
నది యశేషాంగకగ్రాస మైనయట్టి
గ్రహణకాలంబు సుమ్ము సారంగనయన! 131

వ. ప్రాణంబ యాదిత్యుండు. ఆదిత్యుండ చంద్రుండు. ఆప్రాణానిలంబు మూలాధారప్రవేశానంతరం బుదయించు మూర్ధప్రవేశానంతరం బస్తమించు. దేవతలకు మొదలివిషువం బైనమేషాయణంబున సూర్యుం డుదయించు. విషువాంతరం బైనతులాయనంబున నస్తమించు. ప్రాణోదయాస్తమయసమయంబులు విషువద్ద్వయంబు. 132

చ. మొదల సుషుమ్నఁ జొచ్చు నిడముట్టినగాడ్పుల కొంతసేపునం
బిదప సుషుమ్నఁ బుట్టినసమీరము చొచ్చునిడాఖ్యనాడికన్
మొదలను బిమ్మటం బవనముల్ దిరుగంబడి చొచ్చుఁ గానన
య్యదనులు సంక్రమంబులని యాడుదు రాగమతత్త్వకోవిదుల్. 133

వ. అని యవిముక్తక్షేత్రవియోగదుఃఖంబున మానసాంతరవిముక్తక్షేత్రమాహాత్మ్యం బుపన్యసించి యనంతరంబ