పుట:కాశీఖండము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 శ్రీ కాశీఖండము

గీ. పెక్కు మాటల నిటు జాలిపెట్ట నేల
సాధ్వి గర్హింప నొకఁ డెట్టు చాలఁగలఁడు?
గంధవాహంబు వెఱచు నక్కలువకంటి
పసపుపయ్యెద పాలిండ్లఁ బాయఁ దట్ట. 88

తే. ఔర్వశిఖికంటె జముకంటె నర్కుకంటెఁ
బిడుగుకంటెను దీవ్రమై బిఱుసు చూపు
నాత్మఁ దప్పఁగఁ దలఁచుదురాత్మకులకు
సహహ! పతిదేవత పతివ్రతాతిశయము. 89

చ. తొలఁగుదు రంత నంత యమదూతకిరాతులు భీతచిత్తులై
కలుషసమన్వితుం డయిన కాంతుని దారుణలోహపాశశృం
ఖలికలు విచ్చి పుచ్చుకొని కాంత చితాగ్నిశిఖాముఖంబునన్
వెలువడి యాత్మభర్తవెనువెంట హుటాహుటిఁ గూడివచ్చినన్. 90

తే. ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాకభువనంబునం దాత్మనాథుఁ గూడి
వెఱ పొకింతయు లేక చిచ్చుఱికె నేని. 91

తే. తండ్రివంశంబునం దేడుతరములకును
దల్లివంశంబునం దేడుతరములకును
ధవునివంశంబునం దేడుతరములకును
శాశ్వతస్వర్గసౌఖ్య మీఁ జాలు సాధ్వి. 92

వ. అని పలికి బృహస్పతి లోపాముద్రం గనుంగొని దేవీ! నీప్రసంగవశంబునం గొన్ని యోషిద్ధర్మంబులు చెప్పితి. నీవు మహాపతివ్రతవు. నీబోఁటిఫుణ్యవతులు కొందరు గలుగంబట్టిగదా వసుంధర తిరంభైయున్నయది. ఇదె నీకు నమస్కారంబు. 93