పుట:కాశీఖండము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 57

చంద్రకళయట్లు శుక్లపక్షంబురేలు
నాఁడునాఁటికి గనువర్ధనంబు కరణి. 52

సీ. పాలిండ్లు గదలంగఁ బసపుఁబయ్యెద వీచు
నచలాధిపతికూర్మియాడుబిడ్డ
థూత్కార మొనరించు తొండంబుముక్కున
శ్రీకరాసారంబుఁ జిలుక డుంఠి
ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగ
మృదులహస్తము సాంచి మేను నివురుఁ
బ్రమథోత్తముఁడు భృంగి భయరక్షణార్థమై
ఫాలాగ్రమునఁ దీర్చు భసిత రేఖ
తే. దక్షిణ శ్రుతి మీఁదుగా ధాత్రిఁ ద్రెళ్ళి
పెద్దనిద్రకు మ్రాఁగన్ను పెట్టువేళఁ
బంచజనులకుఁ దారక బ్రహ్మవిద్య
యభవుఁ డుపదేశ మొనరించు నపుడు కాశి. 53

వ. అని వారణాసీపురంబు వర్ణించుచు. 54

తే. వృక్షశాఖాంచలంబుపై వ్రేలుచున్న
కోటిసంఖ్యల నీర్కావికోర్పణములు
విఘ్నమృగములఁ బట్టంగ వేసినట్టి
చీరతెర లనసంస్మృతిఁ జిగురు గొలుపు. 55

సీ. ఎదుర లోపాముద్ర పదపద్మములముద్ర
సికతిలం బగునేలఁ జెలువు మిగుల
శ్యామాకముష్టియాచ్ఞార్థంబు మృగములు
ఋషికన్యకలరాక కెదురుచూడ