పుట:కాశీఖండము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48 శ్రీకాశీఖండము

చుచున్నవాఁడు. అతఁడు మీకార్యంబు సంఘటింపంగలవాఁడు. మీ రచ్చోటి కరిగి యమ్మహాత్ము నభ్యర్థింపుఁడు. 29

క. వాతాపీల్వలు లనియెడు
దైతేయులఁ గుపితకపటతంత్రోద్ధతులన్
భ్రాతల వధించె వ్రేల్మిడి
నాతం డెవ్వరుసు వెఱతు రమ్మునిపతికిన్. 30

వ. పొండు మీకు మే లయ్యెడు నని పుండరీకభవుండు వీడ్కొల్పిన వారును మహాప్రసాదంబని ప్రసన్నాంతరంగులై సత్యలోకంబు వెలువడి *(వచ్చువా రంతరాంతరంబుల మూర్తిమంతంబులైన వేదంబుల వేదాంగంబుల యజ్ఞంబుల దక్షిణల సత్యంబు ధర్మంబు దపంబు శ్రుతిస్మృతిపురాణేతిహాసంబులం బతివ్రతల బ్రహ్మచారుల మాతాపితృభక్తుల గోగ్రహణహితుల గాయత్రీజపపరాయణుల నుభయముఖగోప్రదాతలఁ గపిలాదానతత్పరుల బ్రాహ్మణపాదోదకప్రాశనుల సరస్వతీతీర్థమృతుల మకరరాశిస్థితుండై మార్తాండుం డుండ మాఖస్నానంబు ప్రయాగతీర్థంబునం జేసినకృతార్థుల వారణాసియందుఁ బంచనదంబునం గార్తికమాసంబునం దీర్థంబాడినవిశుద్ధదేహులఁ గురుక్షేత్రంబునం గాకిణికామాత్రం బైనను గనకంబు దానంబు చేసినదాతలను విలోకించుచు). 31

తే. విమల కైవల్యకల్యాణవిత్తనిధికి
విశ్వనాథుని మొదలిశ్రీవేశ్మమునకుఁ
గాశికాక్షేత్రమున కేఁగఁ గడలి రపుడు
కోర్కు లిగురొత్త బృందారకులును మునులు. 32