పుట:కాశీఖండము.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

467


బడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగుల వైచి కోపావేశంబున.

155


తే.

ధనమదంబును వేదవిద్యామదంబు
మోక్షలక్ష్మీమదంబును ముదిరి కాదె
కాశికాపట్టణంబునఁ గరుణ లేక
బ్రాహ్మణులు నన్ను నిటు భంగపఱచి రనుచు.

156


వ.

కృష్ణద్వైపాయనుం డాత్మగతంబున.

157


తే.

ధనము లేకుండెదరు మూఁడుతరములందు
మూఁడుతరములఁ జెడుఁ గాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడుతరముల [1]వెలయవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున.

158


వ.

అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపియింపందలంచునవసరంబున నొక్కవిప్రగృహంబువాకిటఁ బార్వతి [2]ప్రకృతస్త్రీవేషంబున.

159


ఉ.

వేనలి పాటపాట నరవెండ్రుకతోఁ దిలతండులాన్వయ
శ్రీ నటియింపఁ గై సడలి వ్రేఁకనిచన్నుల పాలవంకపైఁ
గౌ నసియార్ప వాలుఁదెలికన్నులు గల్కితనంబు వీడ్కొనన్
మానిని హస్తమూఁది యొకమంజులభాషిణి వచ్చె వీథికిన్.

160


ఉ.

వేదపురాణశాస్త్రపదవీనదవీయసి యైన పెద్దము
త్తైదువ కాశికానగరహాటకపీఠశిఖాదిరూఢ య
య్యాదిమశక్తి సంయమివరా! యిటు రమ్మని వీచె హస్తసం
జ్ఞాదరలీల రత్నకటకాభరణంబులు ఘల్లుఘ ల్లనన్.

161


వ.

చేరం బిల్చి యమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె.

162
  1. వెడలవలయు
  2. ప్రాకృత