పుట:కాశీఖండము.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

శ్రీకాశీఖండము


సీ.

పాదపద్మములందుఁ బ్రభవించునప్పుడు
        ప్రత్యగ్రయావకద్రవము చెలువు
కటిమండలంబుపైఁ గనుపట్టునప్పుడు
        కనకకాంచీదామకంబు డాలు
వలుఁదచన్నులమీఁద మొలతెంచునప్పుడు
        కాశ్మీరజాంగరాగంబు పొలుపు
సీమంతపదమునఁ జిగురొత్తునప్పుడు
        రమణీయసిందూరరజము సొబగు


తే.

ప్రోదిసేయుచు భగ్గున భుజగహారు
రాణివాసంబు దివ్యవిగ్రహమునందు
రవులుకొని మండె నాస్థానరంగభూమి
నధికరోషోత్థితంబు యోగానలంబు.

76


సీ.

ఆక్రోశ మొనరించె నాహారవంబుతో
        బంధువర్గము శోకపరవశమున
మొగములు తెల్లనై మునులు దేవతలును,
        భీతిల్లి చేతులు పిసికికొనిరి
చ్యుతవికంకతతరుస్రుక్స్రువప్రకరమై
        విభ్రాంతిఁ బొందె ఋత్విగ్గణంబు
[1]ప్రజ్వలింపఁగ నాఱుభంగి యేమియు లేక
        యుడివోయి చల్లనై యుండె వహ్ని


తే.

పుట్టె నుత్పాతములు పెక్కు భువిని దివిని
విడిచిపోయిరి యొకపాటి విబుధమునులు

  1. 'ప్రజ్వలింపఁగరానిభంగి గా కొకభంగిఁ దఱచుగానుండె వైతాళివహ్ని' అని అచ్చుపుస్తకము.