పుట:కాశీఖండము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 23

చుటయు, జైగిషవ్యౌపాఖ్యానంబు, కృత్తివాససముత్పత్తి, దుర్గామాహాత్మ్యంబు, ఓంకారమాహాత్మ్యంబు, త్రిలోచనసముద్భవంబు, కేదారేశధర్మేశమాహాత్మ్యంబులు, పక్షికథ, విశ్వభుజాఖ్యానంబు, దుర్దమకథ, విశ్వేశ్వరాఖ్యానంబు, కామేశ్వరవిశ్వకర్మేశ్వరసరస్వతీశ్వరామృతేశ్వరవర్ణనంబులు, వ్యాసభుజాస్తంభంబు, క్షేత్రతీర్థకదంబవర్ణనంబు, ముక్తిమంటపవర్ణనంబు, విశ్వేశ్వారావిర్భావంబు, దేవతాయాత్రావిధానంబు ననఁ బుణ్యాఖ్యానంబు లేకోత్తరశతంబునుం గలిగి. 82

శా. ఆశాస్యంబులు సంఘటించును బహూపాఖ్యానశాఖోపశా
ఖాశోభాసముదంచితాభ్యుదయమై స్కాందాబ్ధిసంజాతమై
యీశానుగ్రహలబ్ధముక్తిఫలమై యెక్కాలమున్ శ్రోతకున్
గాశీఖండ మఖండవైభవమునన్ గల్పద్రుమప్రక్రియన్. 83

వ. పూర్వఖండంబున బ్రహ్మర్షి నారదుండు తీర్థయాత్ర చరించెనని సూతుండు శౌనకాదిమహామునులకుం జెప్పి వా రడుగంగా గాశీవృత్తాంతం బిట్లని చెప్పం దొడంగె. కృష్ణద్వైపాయనుండు ప్రియశిష్యుఁడైన సూతున కనంతరకథాక్రమంబునం గాశీఖండకథాకథనప్రారంభంబున నిట్లనియె. 84

నారదుఁడు వింధ్యమున కేతెంచుట

తే. ఇవ్విధంబునఁ దీర్థంబు లెల్ల నాడి
నర్మదానది నవగాహనం బొనర్పఁ
దలఁచి గోదావరీసింధుతటము పట్టి
దండకారుణ్యవీథిమధ్యంబు దరిసి. 85

వ. ముందట. 86