పుట:కాశీఖండము.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

327


సీ.

ప్రాణంబు ప్రాణంబు లగుతల్లిదండ్రుల
        హృదయంబులోన నే నెట్టు మఱతుఁ?
బితృమాతృహీన నై యతిశోచ్యవృత్తి మై
        నెబ్భంగి నీదుదు నీభవాబ్ది?
నేల కల్పించ నా కీరూపలావణ్య
        సౌభాగ్యసంపద జలజభవుఁడు?
కులశీలరూపాదిగుణములు వీక్షించి
        యెవ్వారి కీ నేర్తు నేన నన్ను?


తే.

ననుచు నిర్వేదమునఁ బొందె నలరుఁబోఁడి
పురుషు నెవ్వనిఁ జిత్తంబు చొరఁగ నీక
బ్రహచర్యవ్రతస్థితి బదిలపఱిచి
యుత్తరార్కునికడఁ జేసె నుగ్రతతపము.[1]

331


ఉ.

నిత్యము నిష్ఠతోడ ధరణీసురకన్యక కాశి నుత్తరా
దిత్యునిపార్శ్వభాగమునఁ దీవ్రతవం బొనరింప వచ్చి సాం
గత్యము చేసెఁ గూర్మి చెలికత్తియకైవడి నొక్కమేఁక సం
ప్రీత్యనులబ్ధి నంగనయుఁ బ్రేమ మొనర్చుచు నుండె దానిపైన్.

332


తే.

రాత్రి దూర్వాప్రవాళ చర్వణ మొనర్చి
యుత్తరాదిత్యకుండిక నుదక మాని
పగలు నాల్జాలు సేవించుఁ బద్మనయన
వత్సలత మీఱ [2]నలవోక వయసుమేఁక.

333
  1. 331-వ పద్యమునకుఁ దరువాత కొన్నిప్రతులలో ‘వ. ఇవ్విధంబున దపంబు సేయుచు నక్కన్యకారత్నంబు’ అని యొకవచనము గనఁబడుచున్నది.
  2. ‘నెలమ్రోఁక’ అని ముద్రితప్రతి