పుట:కాశీఖండము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 శ్రీకాశీఖండము

భీమేశ్వరశిష్యునకు
న్వేమాంబాగర్భసలిలనిధిచంద్రునకున్. 64

క. త్రైలోక్యవిజయసౌధవి
శాలమహాచంద్రచంద్రశాలాసతత
వ్యాలోకితగౌతమక
న్యాలహరీవిరహతాండవాటోపునకున్. 65

క. అనితల్లివల్లభునకున్
గనకాద్రివినిద్రకల్పకద్రుమలీలా
వనభవనకిన్నరస్త్రీ
జనతాజేగీయమానచారిత్రునకున్. 66

క. నిర్ఘృణనిర్ఘాతస్ఫుట
నిర్ఘోషకఠోరధాటినిస్సాణమహా
దీర్ఘతరధణధణాంకృతి
దూర్ఘట్టననిర్దళితచతుర్దిక్కునకున్. 67

క. హాటకకుభృద్ధనుర్ధర
జూటీకోటీకుటీరసుమనస్తటినీ
వ్యాటీకోర్మీసంఘో
ద్ఘాటవచోవైఖరీజితద్రుహిణునకున్. 68

క. గజదళవిభాళబిరుదున
కజగవధరభక్తిభావితాత్మునకు సమి
ద్విజయునకు రాయవేశ్యా
భుజగునకును వీరభద్రభూపాలునకున్. 69

వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కాశీఖండంబు. 70