పుట:కాశీఖండము.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

శ్రీకాశీఖండము


మంత్రరాజంబు గాయత్రి మహిమ నొప్పుఁ
గడుపు చల్లంగ శ్రుతివిద్యఁ గన్నతల్లి.

210


వ.

గాయత్రిత్రివారజపంబు ప్రాణాయామంబు, గాయత్రిదశవారజపంబు తపంబు. జలాంతరమున గాయత్రీత్రివారజపం బొండె [1]విష్ణుసంస్మరణం బొండెఁ జేయునది. స్నానానంతరంబ కారుణ్యపితృప్రీతికరంబు వస్త్రనిష్పీడనం బొనర్చునది. ఇది స్నానవిధానంబు.

211


క.

ధౌతపరిధానపరుఁడై
ప్రాతస్సంధ్యను భజించి బ్రాహ్మణుఁడు కుశా
న్వీతకరాంగుళియై ఖ
ద్యోతనునకు నర్ఘ్య మిచ్చు నుదయింపంగన్.

212


వ.

అనంతరంబ గాయత్రీజపం బాచరించునది.

213


తే.

పగలు నిలుచుండి జపియించు నిగమమాత
మాపు గూర్చుండి జపియించు మహితభక్తి
బ్రాహ్మణుఁడు సంధ్య వార్వని బ్రాహ్మణుండు
గీసతక్కువశూద్రుండు కేవలంబు.

214


వ.

ఈప్రకారంబునన మధ్యాహ్నకాలంబునను బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నింద్రాదిదిక్పాలకుల మరిచ్యాదిమహర్షుల మన్వాదిమనువుల సలిలతర్పణంబులం దృప్తిం బొందించునది. చందనాగరుకర్పూరగంధోన్మిశ్రితంబు లగుజలంబులు తర్పణార్హంబులు. దైవం బార్షంబు బ్రాహ్మంబు పైతృకం బనుతీర్థకంబుల దేవాదితర్పణంబులు నాచరించునది.

215
  1. ప్రణవత్రివారజపం బొండె