పుట:కాశీఖండము.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

శ్రీకాశీఖండము


వ.

అయ్యవసరంబునఁ దత్సభాసదు లగుమునీంద్రు లప్పరమేష్ఠికిం బ్రణమిల్లి యిట్లనిరి.

85


తే.

వరద! వాగ్వధూవల్లభ! వనజగర్భ!
యడుగఁ గల దొక్క సంశయితార్థ మిప్పు
డవ్యయం బగుతత్త్వ మెయ్యదియొ తెలియ
నంతవట్టును బ్రీతి మా కానతిమ్ము.

86


వ.

అనిన విని భారతీవల్లభుండు శ్రీమహాదేవమాయామోహవశంబునం [1]బరమాత్మవివేకంబు లేక వారలం జూచి జగద్యోని యగునే నొక్కరుండన యీశ్వరుండ. నా కధికుండు (నీశ్వరుండు) లేఁడు. మీ రివ్విధంబు దెలిసి యవ్యయతత్త్వంబు నన్న కా భావింపుఁ డనియె. అయ్యహంకారంబు సహింపక తత్సమీపంబున నున్న విశ్వంభరాంశసంభవుం డగుక్రతుపురుషుండు నిటలభ్రూకుటి దుర్నిరీక్షుండుం గ్రోధతామ్రాక్షుండు నగుచు నతని కి ట్లనియె.

87


క.

పరతత్త్వ మెఱుఁగ కూరక
పరమర్షులతోడ నేన పరముఁడ ననుచున్
సుర లెల్లఁ గాకు చేయఁగ
దురహంకృతిఁ సేయఁదగునె? తోయజగర్భా!

88


వ.

విను మేను సాక్షాన్నారాణుండను, యజ్ఞపురుషుండ, జగత్ప్రభుండ, నవ్యయుండ, నవ్యయ(తత్త్వ)శబ్దవాచ్యత్వంబు నాయంద సంప్రతిష్ఠితంబు. నీ విట వలవని పెద్దఱికంబున నడిచి పడకుండు మనియె. ఇ ట్లిద్దఱుఁ బరస్పరజయార్థు

  1. పరాత్మపరామర్శ; పరామర్శవివేకంబు