పుట:కాశీఖండము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 5

తే. నైషధాదిమహాప్రబంధములు పెక్కు
చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ!
యిపుడు చెప్పఁ దొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్యపేర. 13

శా. ఈక్షోణిన్ నినుఁ బోలు సత్కవులు లే రీ నేఁటికాలంబునన్
దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభావంబు న
ధ్యక్షించున్ గవిసార్వభౌమ! భవదీయప్రౌఢసాహిత్యముల్. 14

వ. అని యనంతరంబ కర్పూరవసంతరాయండు వీరభద్రేశ్వరుండు కర్పూరతాంబూలసహితంబుగా జాంబూనదాంబరాభరణంబు లిచ్చినం బరిగ్రహించి. 15

సీ. ఆంధ్రక్షమామండలాఖండలుండైన
వేమభూపతి కృపావీక్షణంబు
ఘోడెరాయాంక! సద్గురురాజ భీమేశ్వ
రస్వామి పదసమారాధనంబు
కమలాద్రినిలయ మార్కండేయశివమౌళి
చంద్రాంశు నవసుధాసారధార;
వేదాద్రినరసింహ విపులవక్షస్స్థలీ
కల్హారమాలికాగంధలహరి
తే. గారణంబులు నుద్బోధకములు గాఁగ,
సంభవించిన సాహిత్యసౌష్ఠవమున
వీరభద్రేశ్వరుఁ బ్రబంధవిభునిఁ జేసి
కాశికాఖండముఁ దెనుంగుఁగా నొనర్తు. 16