పుట:కాశీఖండము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

శ్రీకాశీఖండము


నేయుండు. పరసంతాపకారి కటుకవచనుం డగు కుటిలబుద్ధిని సింగలంబుల గ్రాఁగిన మంగలంబున వ్రేల్చుఁడు. పరునియందు మిథ్యాదోషం బారోపించునిర్దయు బ్రవర్ధనపూయశోణితకర్దమంబున ముంపుఁడు. గురునిందాకర్త యగుధూర్తునోట సంవర్తతప్తలోహంబు పోయుండు. పరకళత్రనాశకుం డగు సంకుసుకుచెవుల నిశ్శంకకలాయనశంకువులు గూర్పుఁ డని దండధరుండు ప్రచండకోపాటోపంబునఁ గింకరులం జూచి పలుకు. వెండియు.

154


గీ.

రౌరవం బనఁగను మహారౌరవ మనఁ
గాలసూత్రంబు గుంభిపాకం బనంగ
నంధతామిస్ర మనఁగ సంహార మనఁగ
నారకంబులు మఱియు నెన్నంగఁ గలవు.

155


వ.

ఈనరకంబులయందు దేవస్వభోక్తల బ్రహ్మస్వభుజుల శిశుహంతలఁ గృతఘ్నుల గురుతల్పగుల గోఘ్నస్త్రీఘ్నమిత్రఘ్నల బరక్షేత్రపరాలయాపహర్తలఁ గూటసాక్షుల గర్భఘ్నులఁ బ్రజాపీడాకరుల సురాపులఁ గూటశాల్మలిం బ్రాకించియుఁ బట్టుగార్లం బట్టించియుఁ దలక్రిందుగా (వ్రేల)గట్టించియు నిక్షుయంత్రములఁ బీడించియు నంధకూపంబునం ద్రోపించియు నినుపముక్కులకాకులం గఱపించియు యమకింకరులు పెక్కువిధంబుల బాధలు పెట్టుదురు.

156


క.

హరినామకీర్తనంబును
హరినామజపంబు నెవ్వఁ డాత్మఁ బఠించున్
నరకమహావేదన య
న్నరునకుఁ బ్రాపింపకుండు నయతత్త్వనిధీ!

157