పుట:కాశీఖండము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

శ్రీకాశీఖండము


వ.

అని ధర్ముండు శివశర్మ నభినందించి నిజనివాసంబునకుం బోయెఁ దదనంతరంబ.

145


గీ.

విప్రకులముఖ్యుఁ డంతట వినయపరత
నిటుల ననియె హృషీకేశుహితులఁ జూచి
యనఘులార! యతిక్రూరుఁ డండ్రు జముఁడు
సౌమ్యుఁడై యున్నవాఁ డేమిచంద మొక్కొ?

146


గీ.

యమునిరూపంబు వర్ణింతు రఖిలమునులు
గుండె ఝల్లనునట్లుగా ఘోరలీల
జమునిఁ జూడఁగఁ గన్నులు చల్లనయ్యె
నిప్పు డారౌద్రరసరేఖ లెందుఁ బోయె?

147


గీ.

ఇదియ రూపంబొ? యీతని కింక నొక్క
రూప మున్నదియో? మహాక్రోధమునకు
నెఱుఁగ నానతియిండు నా కీరహస్య
మనఘమతులార! సందేహ మావహిల్లె.

148


వ.

అనిన [1]వారలిట్లనిరి.

149


క.

నినుబోటి పుణ్యవంతుల
కనఘా! శమనుండు సౌమ్య మగు నాకారం
బున నుండు దుర్జనుల కీ
యన రౌద్రాకారుఁడై యుదగ్రత చూపున్.

150


వ.

ఈదండధరుండు దంష్ట్రాకరాళవదనుండును, గ్రోధరక్తాంతలోచనుండును, నూర్ధ్వకేశుండును, గృష్ణాంగుఁడును, బ్రళయాంబుదనిస్వనుండును, బరిభ్రమద్భ్రుకుటీకుటిలనిటలతట

  1. శివశర్మకు ఫుణ్యశీల సుశీలు రిట్లనిరి.