పుట:కాశీఖండము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

113


సీ.

పొడిదగ్గు కంఠంబుఁ బొరివుచ్చకయమున్న
        తల ప్రకంపంబుఁ బొందకయమున్న
బొమలు కన్నులమీఁదఁ బొదివి వ్రాలకమున్న
        పగ నేత్రముల కడ్డు పడకమున్న
శ్రుతిపుటంబుల శక్తి సురిఁగి పోవకమున్న
        వళు లాననమునఁ బర్వకయమున్న
హృదయంబులో జాగ పదను దప్పకమున్న
        గాత్రంబు శిధిలంబు గాకమున్న


తే.

పండ్లు వేర్వాసి కదలుచూపకయమున్న
కాళికడకంటిచూపు పై రాకమున్న
కాలుసేయాడుకాలంబె కదలవలయుఁ
దీర్థసేవకు దేహ మస్థిరము గాన.

84


వ.

అని తీర్థయాత్రాపరాయణుండై యిల్లు వెడలి రెండుమూఁడుపయనంబులకొలఁదితెరవున నొకవటవృక్షంబుక్రింద బరిశ్రమాపనోదార్థంబు విశ్రమించి యంతరంగంబున నిట్లని వితర్కించె.

85


మ.

కరికర్ణాంతవిలోల మాయువు శరత్కాదంబినీచంచలా
తరళంబాత్మ పయస్తరంగచలముల్ తారుణ్యముల్ తీర్థముల్
పరిపాటిం జతురంతధాత్రిఁ జరియింపన్వచ్చునే యైన నేఁ
బురముల్ నాలుగుమూఁడుముక్తిజనకంబుల్ మున్ను వీక్షించెదన్.

86

సప్తపురీప్రశంస

తే.

ఉజ్జయిని కాశి మాయ యయోధ్య కాంచి
మథుర ద్వారక యనెడి నామములు గలిగి