Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కోపింపుట కోపించుట, కాపించుట పసుల నొప్పఁ గాయించుట నా
నేపారు నిట్టిపలుకులు, లోపుగ బహుళములు జగతిలో నెఱుఁగఁదగున్.

166


గీ.

తెలుఁగుఁబలుకులు పునరుక్తిఁ బలుకుచోట, గదిసి రెండవపదమున మొదలివ్రాఁత
దనరు గిత్వంబు ప్రాసంబు దప్పకుండ, వర్ణములు దీర్ఘహ్రస్వప్రవర్తు లగుచు.

167


క.

పులిగిలి యనఁ గరిగిరి యన, నలిగిలి యన నోడగీడ యనఁగా బరఁగున్
నలలు గిలు లనఁగ బలవం, తులు మఱి గిలవంతు లనఁగఁ దుద సరియగుచున్.

168


క.

స్మరధరచరవరపదములు, పరఁగుఁ గ్రియాపదము నొందుపట్టులనెల్ల
న్వరుప రకారములోపలఁ, బొరి నిత్వ మడంగుఁ గాక పొడమినఁ బొడమున్.

169


క.

స్మరియించె సంస్మరించెను, ధరియించె ధరించె బూవుదండఁ జరించెం
జరియించె వల్లభునిసతి, వరియించె వరించె నాఁగ దలనై యునికిన్.

170


క.

ఇది తెనుఁగున కెల్లను జన, పదవిదితం బైనతెఱఁగుప ట్టించుక యె
ల్లిదముగఁ జెప్పితి నంతయు, మది నెఱుఁగుం డరసి బుద్ధివంతు లితరముల్.

171


మ.

లలి ననోన్యముఖావలోకనము లీలం జేయఁగాలేని యా
విలసత్కావ్యకళాచతుష్టయము లుర్విం బగ్వ నేకస్థలిం
గలిగించెం బదవాక్యవేదియు నలంకారఙ్ఞుఁడున్ భూవరో
జ్జ్వలవిద్యావిభవోన్నతుండు నగువిశ్వక్ష్మావిభుం డిమ్ములన్.

172


మ.

కవివాత్సల్యకళాచరిష్ణుఁడు జగత్కల్యాణవర్ధిషణుఁ డు
త్సవసంపుష్టసుపర్వగర్వుఁడు జయశ్లాఘాప్తసగంధర్వుఁ డా
ర్జవశీలాదివిశుద్ధవృత్తుఁడు విరాజద్విక్రమాయత్తుఁ డు
చ్ఛవిశాలామలకీర్తిపూరుఁడు సంతేజస్స్ఫారుఁ డెల్లప్పుడున్.

173


క.

శ్రీమచ్చళుక్యవిశ్వ, క్ష్మామండలవిభుఁడు సకలసంగ్రామజయ
శ్రీమంతుఁడు సంతతనత, సామంతుఁడు కామినీవసంతుఁడు లీలన్.

174


తరళ.

బిరుదమిత్రుఁడు భిన్నశత్రుఁ డుపేంద్రపుత్రుఁడు యామినీ
శ్వరకులేశుఁడు మానవేశుఁడు వాహినీశుఁడు విక్రమ
స్ఫురణరాముఁడు నూత్నకాముఁడు పూర్ణసోముఁడు కీర్తులం
బరఁగుచుండెడు మాసుధాకరభానుతారకవిశ్రుతిన్.

175