Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాసప్రకరణము

క.

మొదలిపదాంతవిభక్తిని, వదలుచుఁ దుదిపదము మొదలివర్ణముతోడం
గదిసిన నదికినశబ్దముఁ, జదువులను సమాస మనఁగఁ జను నండ్రు బుధుల్.

121


వ.

అది తత్పురుషంబును, గర్మధారయంబును, బహువ్రీహియు నన మూఁడుతెఱంగులం
బ్రవర్తిల్లు, నంధ్రభాషాప్రయోగంబుల నందుఁ దత్పురుషంబులకు నొక్కతెఱం
గెఱింగింతు.

122


క.

రాచిలుకలు విరజాజులు, రాచకొడుకు లంపగములు రాయంచలు నా
రాచినయట్టిసమాసము, లేచుం దత్పురుష మన ననేకం బగుచున్.

123


క.

నెలిదమ్మి కమ్మఁదూపులు, వలకే లెడకాలు నీలవర్ణము నవసా
లులరుచులచే సమాసము, లలవడియెం గర్మధారయములు దెనుఁగునన్.

124


గీ.

పూవుఁబోఁడి తలిరుఁబోఁడి పూవిల్తుండు, వాలుఁగంటి నాతనాఁడి మించు
మొలక మచ్ఛెకంటి ముక్కంటి యన బహు, వ్రీహి పెక్కువిధుల విస్తరిల్లు.

125


వ.

మఱియు వీనికి సాధారణలక్షణంబు లొకకొన్ని యెఱింగింతు.

126


గీ.

గుణిగుణంబు చెప్పం గొఱలు విశేషణ, పదముపై నికార ముదవుఁ బాయు
నాతికెల్ల నాఁడు నల్లనికనుఁగవ, నల్లకన్నుఁగద యనంగ వరుస.

127


క.

విదితవిశేషపదాంతము, గదిసి పుకారంబు నిలుచుఁ గడ హ ల్లున్నం
బదపడి య చ్చుండిన బుటు, లొదవు ముకారంబుఁ ద్రోచి యోలిం గృతులన్.

128


క.

గూఢపుమంత్రంబులు నతి, గాఢపుఁగర్మములు సోయఁగపుటాటలు నా
రూఢపుటాలాపంబులు, ప్రౌఢములగు నీసమాసఫణితులయందున్.

129


క.

ఇలఁ బల్లు ముల్లు విల్లును, హలాదులను నదుకుచోట నడఁగును జడ్డల్
పలువరుసయు ములుమోదుగు, విలుకాఁడు ననంగ నెందు విశ్రుత మగుటన్.

130


గీ.

వెన్ను కన్ను చ న్ననియెడు వీనిజడ్డ, లుడుపుటొప్పు సమాసనియోజనములఁ
దనర వెనుగాఁడ కనుదోయి చనుములకలు, నా సమాసంబు లొప్పు నానావిధముల.

131


క.

ఆదట నా నీ తన యను, చో దుత్వము గలుగు షష్ఠి చూపెడునెడలన్
నాదు కళాసంపదయును, నీదు వివేకంబుఁ దనదు నిపుణతయు ననన్.

132


క.

నా నీ తన యనుపలుకుల, తో నదుకు దుకార మపుడు దొలఁగిన దొలఁగుం
బూని సమాసము సంస్కృత, మైనను షష్ఠ్యర్థహేతువై సత్కృతులన్.

133