శాస్త్రం బదియును బహుమతంబుల సంకీర్ణం బగుటను గీర్వాణ భాషామయం బగుటను సర్వసాధారణంబు గాదు; కావున నది త్రిలింగభాషారచితంబైనం దేటయై యిక్కలికాలంబున కను రాగసౌహృదకరంబై గ్రాహ్యంబై నరక్షణీయంబై యొప్పు బహు కాలంబు నిలువ నద్దాన న్యశంబు గలుగునని నిశ్చయించి యీ కృతికిఁ బ్రారంభించితి నే తదాదియందుఁ దదీయవంశావతారం బభివర్ణించెద.
అఖిలజగత్స్రష్ట యగుకశ్యపబ్రహ్మ గణుతింప నెవ్వాని కన్నతండ్రి సమదరాక్షసహారి శతకోటిరమణీయ దోర్బలుం డెవ్వానితోడఁబుట్టు వలఘుచతుర్వర్గఫలహేతువగు నాగ మత్రయం బెవ్వాని మాన్యమూర్తి సృష్టిస్థితిలయప్రసిద్ధులౌ ముమ్మూర్తు లరయ నెవ్వాని మూర్త్యంతరంబు లెవ్వఁడు గభస్తితతివర్షహిమఘనాత పములఁ గల్పించి లోకైకబంధుఁ డయ్యె నతఁడు పొగడొందు సర్వదేవాధికుండు భవ్యతేజోమయాత్ముండు భాస్కరుండు.