పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కళాపూర్ణోదయము

   
    మతిఁ జెలంగుభాగ్యవతి యీలతాంగి యె
    వ్వతె యొకో మనంగవలదె యిట్లు. 170

చ. మునుపు నిజేశు నర్థపతిముద్దుకుమారుఁ డటంచు నానితం
    బిని పలుకంగ వింటిని గుబేరతనూజునికిం గరంబు మో
    హనయగుకాంత రంభయని యాడుకొనంగ వినంబడు న్మనం
    బున నిపుడెన్న నామెఱుగుఁబోఁడియ కావలయు న్నిజంబుగన్. 171

క. ఇప్పుడిది నిశ్చితంబుగ
   నప్పరమమునీంద్రుఁ జేరి యడుగఁగవలయుం
   దప్ప కతఁ డమరమౌనియ
   యప్పటి కప్పటికి వచ్చు యదుపతికడకున్ 172
 
క. అని చింతించుచు సాయం
   గన తా నొక్కతియ యేఁగి కడుఁ జేరువ నా
   యనుపమతేజుని నారద
   ముని గాగ నెఱింగి వినయమునఁ బ్రణమిల్లెన్. 173

వ. ప్రణమిల్లి లేచి విరచితాంజలియై. 174

క. మౌనీంద్రచంద్ర యిపుడు వి
   మానముతో నేఁగినట్టిమహితాత్ములు రం
   భానలకూబరులే యన
   నానారదుఁ డట్ల యగుదు రని యాయకతోన్. 175