పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కళాపూర్ణోదయము

వ. అని యీ ప్రకారంబుల మఱియుఁ దాను జెలికత్తెలు నొండొరులతో ననేకవిధ సరససల్లాపంబులం
    బిసాళింపుచు నింపుదళుకొత్త గ్రొత్తవిరిగుత్తుల చేత నేత్రపర్వం బగుచున్న యాపువ్వుఁదోఁట
    దఱియంజొచ్చి. 146

సీ. అరవీడుకొప్పులవిరులవాసనకుఁ దో
                     రపు టూర్పుఁదావులు ప్రాపు గాగఁ
    నడలమందతఁ బెంచుబడలికలకుఁ బిఱుం
                     దులవ్రేఁగుఁ జను వ్రేఁగుఁ దోడుపడఁగఁ
    జెమటచిత్తడిఁ గ్రొత్తచెలువు గాంచినవళుల్
                     మొలనూళ్ల కాంతికి బలిమి నొసఁగఁ
    బయ్యెద లాడింపఁ బ్రభవించుకంకణ
                     నాద మందెలమ్రోఁతఁ బ్రోది సేయ

గీ. మిగుల రొదగాఁ గికాకిక సగుచు రతుల
    యాయములు సోఁక నెద్దియే నాడుకొనుచు
    సందడింపుచుఁ బుష్పాపచయము సలిపి
    యంతఁ గడఁగిరి డోలావిహారములకు. 147

వ. అప్పు డాకాశమార్గంబునం గృష్ణసేవాలాలసుం డగుచు నేగుదెంచు నారదమహామునీంద్రుని
   మణికంధరుం డనుగంధర్వకుమారుండు గానవిద్యావిశేషాభిలాషంబునం గొలిచి వచ్చుచు నుండి
   యమ్మగువలప్రగల్భతాగరిమకు వెఱఁగందుచు శతానందనందనున కిట్లనియె 148