పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయా శ్వాసము

129


   వేఱొక్కగతిగ భావింపర మముబోంట్ల
              సంస్పర్శమాత్రంబు సమ్మతింప
   నుచితంబు గా దంటి రుచితంబె మఱి నాదు
              ప్రాణహానికి నోర్చు టరసి చూడఁ

గీ. బలుపలుకు లేల యిక నాచెలులు గిలులు
   నేగుదెంచి విఘ్న మొనర్తు రిత మెఱుఁగక
   కావునం గొనిపొమ్ము శీఘ్రంబ నీదు
   వెనుక నిడుకొని నన్ను మద్విభునికడకు.67

సీ. అన నియ్యకొని సిద్ధుఁ డరు దైన పులితోలు
               పల్లంబుతోడ నిబ్బరపుబిగిని
    బొట్టపట్టెడ గాఁగఁ గట్టిన పెనుఁబాప
               తట్టంబుతోడ వాదపుఁబసిండి
    యంకవన్నెలతోడ సంకుపేరులతోడ
               వశ్యౌషధపుఁదీఁగెవాగెతోడ
    నేక పార్శ్వమున భల్లూక చర్మపుటొఱ
               ఘటియించినట్టిబల్గత్తితోడ

గీ. వఱలు నేనికదిండివార్వమును దొలుత
   గాఁగఁ దానెక్కి నన్ను దాకకయ దీని
   కటివిభాగంబు నెక్కి రాఁగలవె యబల
   వెనుక మరగొమ్ము నూతగాఁ గొనుచు ననియె.68