Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1086

కథాసరిత్సాగరము. లం. 10. త. 4.

చెట్టుక్రిందినుండి ఆ దీనారముల నెల్ల త్రవ్వి పుచ్చుకొనెను. పిమ్మట ఒకనెల గడపి ధర్మబుద్ధిని 'అన్నా, రమ్ము, దీనారములను తెచ్చికొందము, నాకు వ్యయ మున్నది.' అని పిలిచెను. ధర్మబుద్ధి వానితోఁ బోయి పాఁతినచోట వానితోఁగూడ త్రవ్వెను. దీనారములు లేవు. అంతట శఠుఁడు దుష్టబుద్ధి ధర్మబుద్ధితో 'నీవే ఆదీనారముల నెల్ల ఎప్పుడో నాకు తెలియకుండ త్రవ్వుకొని పోయితివి. కావున నాకు వానిలో సగ మిమ్ము.' అనెను. 'నేను కొనిపో లేదు, నీవే కొనిపోయినాఁడవు.' అని ధర్మబుద్ధి పలికెను. ఇట్లు కలహము కలుగఁగా దుష్టబుద్ధి రాతితో తలఁ గొట్టుకొని ధర్మబుద్ధిని రాజకులమునకుఁ గొనిపోయెను. అచట నిరువురును తమవాదములను తెలుపుకొనిరి. రాజాధికారులు నిర్ణయము గానక నిరువురును సాయంకాలమువఱకు అచటనే యుంచిరి. 'ఏచెట్టుక్రింద దీనారమును పాఁతితిమో ఆ చెట్టే, ఈ ధర్మబుద్ధి వాని నపహరించె నని, సాక్ష్యము చెప్పును.' అని దుష్టబుద్ధి రాజాధికారులతోఁ దెలుపుకొనెను. వా రత్యంత మాశ్చర్యపడి 'ఱేపు ప్రాతఃకాలమందు, పోయి ఆ సాక్ష్యము వినియెదము.' అని పలికి వారి నిరువురను జామీనుమీఁద విడిచిపెట్టిరి. ఇరువురును వేఱువేఱుగా ఇంటికి పోయిరి. దుష్టబుద్ధి తండ్రికి రహస్యముగా వృత్తాంతము చెప్పి ధన మిచ్చి 'నీవు చెట్టుతొఱటలో చేరి నా పక్షముగా సాక్ష్యము చెప్పవలసినది.' అని యడిగెను. వాఁడు అంగీకరించెను. వెంటనే